#Hardik Pandya: అంతా నా వల్లే.. సారీ షమీ! పాపం రాహుల్‌... ఇకనైనా..

IPL 2023: Particularly Myself Disappointed Him Feel Sorry: Hardik Pandya - Sakshi

IPL 2023 GT Vs DC: ‘‘రాహుల్‌ మ్యాచ్‌ను మావైపు తిప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆఖర్లో రెండు వికెట్లు కోల్పోవడం దెబ్బతీసింది. నేను కూడా నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశాను. కానీ అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయాము.

మా బౌలర్లు మాత్రం అద్భుతంగా రాణించారు. వాళ్లకు వందకు వంద మార్కులు వేయొచ్చు. బ్యాటర్లు మాత్రం తమ పని పూర్తి చేయలేకపోయారు’’ అని గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా అన్నాడు.

ఐపీఎల్‌-2023లో భాగంగా మంగళవారం నాటి మ్యాచ్‌లో గుజరాత్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్‌ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆదిలోనే గుజరాత్‌ బౌలర్లు ఊహించని షాకిచ్చారు.

ఆ ఒక్కడి కారణంగా
ముఖ్యంగా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ దెబ్బకు ఢిల్లీ క్యాపిటల్స్‌ టాపార్డర్‌ కకావికలమైంది. ఈ క్రమంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అమన్‌ హకీం ఖాన్‌ 51 పరుగులతో రాణించడంతో వార్నర్‌ బృందం.. నిర్ణీత 20 ఓవర్లలో 130 పరుగులు చేయగలిగింది.

పాండ్యా పోరాడినా
ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్‌కు సైతం ఆరంభంలోనే షాకుల మీద షాకులు తగిలాయి. ఓపెనర్లు వృద్ధిమాన్‌ సాహా (0), శుబ్‌మన్‌ గిల్‌(6) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా 53 బంతుల్లో 59 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.

సిక్సర్ల తెవాటియాగా పేరొందిన రాహుల్‌ 7 బంతుల్లో 20 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ ఢిల్లీ సీనియర్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ అతడి ఆట కట్టించడంతో గుజరాత్‌ కథ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయిన గుజరాత్‌ 125 పరుగులు మాత్రమే చేసి  స్వల్ప తేడాతో ఓటమిని చవిచూసింది.

సారీ షమీ.. నా వల్లే
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం హార్దిక్‌ పాండ్యా ఓటమిపై స్పందించాడు. ‘‘ప్రత్యర్థి జట్టు బౌలర్లు సరైన సమయంలో రాణించారు. ఆఖర్లో రాహుల్‌ జట్టున గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టవశాత్తూ మేము ఓడిపోయాం. 

ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో షమీ అదరగొట్టాడు. కానీ మేము అతడికి న్యాయం చేయలేకపోయాం. అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసినా కూడా మేము గెలవలేకపోయాం. షమీ విషయంలో నేను చాలా ఫీలవుతున్నాను. అతడిని మేము నిరాశకు గురిచేశాం. ముఖ్యంగా నా వల్లే ఇలా జరిగింది’’ అంటూ విచారం వ్యక్తం చేశాడు.

లోపాలు సరిచేసుకుని తదుపరి మ్యాచ్‌పై దృష్టి సారిస్తామని పాండ్యా చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ షమీ తన బౌలింగ్‌ కోటా పూర్తి చేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు.

చదవండి: కోహ్లి- గంభీర్‌ గొడవ.. జరిగిందిదే! గౌతం ఆ మాట అనడంతో: ప్రత్యక్ష సాక్షి
IPL 2023: ఐపీఎల్‌ జట్టుకు కొత్త కెప్టెన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top