
ముంబై: వాంఖడే పిచ్.. ఛేజింగ్‌కు ఎక్కువ అనుకూలిస్తున్న పిచ్. ఇక్కడ ఇప్పటివరకూ జరిగిన ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచ్‌ల్లో అత్యధికంగా ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి. అదే వ్యూహంతో సీఎస్‌కేతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ముందుగా బౌలింగ్‌కు వెళ్లాడు. కానీ ఆది నుంచి ఆ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 3 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ఇది భారీ స్కోరు. రెండొందల అంటేనే ప్రత్యర్థి భయపడుతుంది.. అటువంటిది అదనంగా మరో 20 పరుగులు. అయితే కేకేఆర్ గెలుపు అంచుల వరకూ వచ్చి చతికిలబడింది. 19.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగా కేకేఆర్ ఆలౌటైందంటే సీఎస్‌కేకు ఎంత దడపుట్టించిందో అర్థం చేసుకోవచ్చు.
అసలు సీఎస్‌కే ఇంతవరకూ తెచ్చుకోవడానికి కారణాలు లేకపోలేదు. ఈ మ్యాచ్‌లో జడేజాను మాత్రమే స్పిన్ బౌలింగ్‌కు ఉపయోగించుకోగా, మరో స్పిన్ ఆప్షన్‌గా మొయిన్ అలీని ఉపయోగించుకోలేకపోవడం. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా వికెట్లు సాధించి గేమ్ ఛేంజర్‌గా మారిన మొయిన్‌కు కేకేఆర్‌తో మ్యాచ్‌లో అసలు ఓవర్ కూడా ఇవ్వలేదు. జడేజా నాలుగు ఓవర్లే వేసి 33 పరుగులే ఇచ్చి పొదుపుగానే బౌలింగ్ వేశాడు. పేసర్లు సామ్ కరాన్, శార్దూల్ ఠాకూర్‌లను కేకేఆర్ బ్యాట్స్‌మన్ చితక్కొడుతున్న తరుణంలో కూడా మొయిన్‌ను ఉపయోగించుకోలేదు. మొయిన్ ఆఫ్ బ్రేక్ బౌలర్ కావడంతో అక్కడ రసెల్, కార్తీక్‌లు ఎటాక్ చేసి అవకాశం ఉందనే ఆలోచనతోనే అతని చేతికి ధోని బౌలింగ్ ఇవ్వలేదా అనే ప్రశ్న ఒకటైతే, దీపక్ చహర్ చేత పూర్తి ఓవర్ల కోటా బౌలింగ్ 10 ఓవర్లలోపే ఎందుకు వేయించాడనేది మరొక ప్రశ్న.
చహర్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు ఇంత వరకూ ఓకే.. 4 ఓవర్లలో 4 వికెట్లు సాధించి 29 పరుగులతో అదిరిపోయే గణాంకాలు నమోదు చేసి బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఓవర్‌కు వికెట్ చొప్పున తీయడంతో చహర్‌ను కొనసాగించాడు ధోని. కానీ అక్కడ 8 ఓవర్ పూర్తయ్యే సరికి చహర్ కోటా ఫూర్తయ్యింది. సీఎస్‌కే భారీ స్కోరు చేయడం, కేకేఆర్ ఆదిలోనే కీలక వికెట్లను కోల్పోవడం కూడా చహర్ కోటాను ముందుగానే పూర్తి చేయడానికి కారణం అయ్యి ఉండొచ్చు. ఎటాకింగ్ బౌలర్, డెత్ ఓవర్ స్పెషలిస్టు అయిన చహర్‌కు చివరకు కనీసం ఓవర్ కూడా లేకుండా పోయింది. చివరి ఓవర్లలో ప్రధాన బౌలర్‌కి ఒక్క ఓవర్ కూడా లేకపోతే ఎలా ఉంటుందో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో కేకేఆర్‌తో మ్యాచ్‌లో రుజువైంది.
ఒకవైపు మరొక ప్రధాన బౌలర్ ఎన్‌గిడి నాలుగు ఓవర్లలో 28 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు సాధిస్తే, కరాన్ మాత్రం 58 పరుగులిచ్చి వికెట్ సాధించాడు. మ్యాచ్ చివర ఓవర్ వరకూ వచ్చే అవకాశం ఉండటంతో 19 ఓవర్‌ను కరాన్ వేసే సమయంలో చివరి ఓవర్‌పై ఆసక్తి నెలకొంది. ఒకవేళ మొయిన్‌కు ఇద్దామనుకుంటే స్పిన్నర్ చేత ఆఖరి ఓవర్‌ను వేయించడం ఒక సాహసం అవుతుంది. అందులోనూ మ్యాచ్‌లో అప్పటివరకూ ఒక్క ఓవర్ కూడా వేయని మొయిన్ చేతికి బంతి ఇచ్చే అవకాశం లేదు. ఇవన్నీ అభిమానుల్లో ఆసక్తిని తెప్పించాయ. ఆ సమయంలో సీఎస్‌కేకు శార్దూల్ తప్ప వేరే ఆప్షన్ లేదు.
శార్దూల్ వేసిన అంతకుముందు ఓవర్‌లో వరుసగా మూడు వైడ్లు వేశాడు. దాంతో శార్దూల్ 20వ ఓవర్‌ను ఎలా పూర్తి చేస్తాడనే అనుమానం సీఎస్‌కే అభిమానుల్లో తలెత్తింది. కాగా, ఆ ఓవర్ తొలి బంతికే రెండె పరుగు తీసే క‍్రమంలో ప్రసీద్ధ్ రనౌట్ అయ్యాడు. దాంతో సీఎస్‌కే విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. ఒక వేళ అలా జరగకపోయి ఉంటే అప్పటికే సిక్సర్ల మోత మోగించిన కమిన్స్ హిట్టింగ్ చేసేవాడు. ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండటంతో అద్భుతం చేయడానికి ట్రై చేసేవాడు. గత మ్యాచ్‌లోనే చహర్ డెత్ ఓవర్ల స్పెషలిస్టు అని, నకుల్ బాల్స్ వేయడంలో దిట్ట అని చెప్పుకొచ్చిన ధోని.. అతనికి కనీసం ఒక్క ఓవర్‌ను చివరవరకూ ఉంచకపోవడం లెక్కలో ఎక్కడో తేడా కొట్టినట్లే కనబడింది. ఓవరాల్‌గా సీఎస్‌కే గెలిచినా.. రాజస్థాన్ జరిగిన గత మ్యాచ్‌లో ధోని అనుసరించిన వ్యూహాలు మాత్రం ఈ మ్యాచ్‌లో కనబడలేదు.