
స్వదేశంలో శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు జింబాబ్వే జట్టుకు రెండు భారీ షాక్‌లు తగిలాయి. హరారే వేదికగా ఇవాళ (ఆగస్ట్ 29) తొలి వన్డే ప్రారంభం కాగా.. మ్యాచ్ ప్రారంభానికి ముందే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే స్టార్ ప్లేయర్, వికెట్‌కీపర్ బ్యాటర్ బ్రెండన్ టేలర్ గాయాలపాలయ్యారు. ఎర్విన్ స్థానంలో సీన్ విలియమ్స్ సారథ్య బాధ్యతలు చేపట్టగా.. టేలర్ స్థానంలో క్లైవ్ మదండే వికెట్‌కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు.
దాదాపు నాలుగేళ్ల తర్వాత వన్డేల్లో రీఎంట్రీ ఇచ్చిన టేలర్‌కు ఆ ఆనందం ఎంతో సేపు నిలబడలేదు. మ్యాచ్ ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే వికెట్‌కీపింగ్ చేస్తుండగా.. అతడి చేతి వేలికి తీవ్ర గాయమైంది. దీంతో అతను మైదానాన్ని వీడాడు. అవినీతి కేసులో టేలర్ మూడున్నరేళ్ల నిషేధాన్ని ఇటీవలే పూర్తి చేసుకుని అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు.
మరోవైపు తొలి వన్డే ప్రారంభానికి ముందే గాయపడిన రెగ్యులర్ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్‌కు జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రత్యామ్నాయాన్ని ప్రకటించలేదు. ఎర్విన్ వన్డే సిరీస్ మొత్తానికే దూరమైనట్లు మాత్రం ప్రకటించింది.
మ్యాచ్ విషయానికొస్తే.. జింబాబ్వే-శ్రీలంక మధ్య తొలి వన్డే ఇవాళ మధ్యాహ్నం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక 36 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.
పథుమ్ నిస్సంక (76), నిషాన్ మధుష్క (0), కుసాల్ మెండిస్ (38), సదీర సమరవిక్రమ (35) ఔట్ కాగా.. కెప్టెన్ చరిత్ అసలంక (6), జనిత్ లియనాగే (0) క్రీజ్‌లో ఉన్నారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, సకందర్ రజా, సీన్ విలియమ్స్ తలో వికెట్ తీశారు.