
ఆసియాకప్ హాకీ టోర్నీ బరిలో భారత జట్టు
నేడు తొలి పోరులో చైనాతో ‘ఢీ’
మధ్యాహ్నం 3 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
రాజ్‌గిర్ (బిహార్): వచ్చే ఏడాది బెల్జియం–నెదర్లాండ్స్ వేదికగా జరిగే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించాలనే లక్ష్యంతో... నేడు మొదలయ్యే ఆసియా కప్‌లో భారత పురుషుల హాకీ జట్టు బరిలోకి దిగనుంది. ఆసియా కప్ విజేత జట్టు ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత పొందుతుంది. శుక్రవారం మొదలయ్యే ఆసియా కప్ పూల్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో చైనాతో భారత్ తలపడుతుంది. ఇటీవల జరిగిన యూరోపియన్ అంచె ప్రొలీగ్‌లో భారత్ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. 8 మ్యాచ్‌లాడితే ఏకంగా ఏడింట పరాజయాన్నే మూటగట్టుకుంది.
అయితే తాజా ఆసియా కప్ పరిస్థితులను ఐరోపా జట్లు, పరిస్థితులతో పోల్చలేం. కానీ అక్కడ తలెత్తిన లోటుపాట్లను మాత్రం ఇక్కడా కొనసాగిస్తే మాత్రం మూల్యం తప్పదు. హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలో భారత్ డిఫెన్స్‌లో దుర్భేద్యంగా మారాలి. పెనాల్టీ కార్నర్లను గోల్‌గా మలిచే నైపుణ్యాన్ని పెంచుకోవాలి. గోల్‌కీపింగ్ కూడా పటిష్టం కావాలి. రిటైరైన దిగ్గజ గోల్‌కీపర్ శ్రీజేశ్ స్థానంలో ఆడుతున్న కృషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరా ఇంకా చాలా మెరుగవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది.
ఇలా అన్ని రంగాల్లో మెరుగైతేనే మేటి జట్లను నిలువరించగలం. యూరోపియన్ అంచెలో ఎదురైన పరాజయాల భారాన్ని తగ్గించుకోగలం. మిడ్‌ఫీల్డ్‌లో రాజిందర్ సింగ్, రాజ్ కుమార్ పాల్, మన్‌ప్రీత్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్‌లు మరింత బాధ్యత కనబరిస్తేనే ఆసియా కప్‌లో ప్రత్యర్థి జట్లపై పైచేయి సాధిస్తాం. ఆసియా కప్‌లో భారత్, చైనాలున్న పూల్ ‘ఎ’లో జపాన్, కజకిస్తాన్ మిగతా జట్లు కాగా... పూల్ ‘బి’లో దక్షిణ కొరియా, మలేసియా, బంగ్లాదేశ్, చైనీస్ తైపీ జట్లున్నాయి.