Suryakumar Yadav: కల ఫలించింది.. టెస్టుల్లో అరంగేట్రం.. సూర్య, భరత్‌ ఉద్విగ్న క్షణాలు

India Vs Australia 1st Test: Suryakumar Yadav KS Bharat Make Debut - Sakshi

Ind Vs Aus 1st Test Playing XI: టీమిండియా తరఫున అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేయాలన్న టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కల ఎట్టకేలకు ఫలించింది. అదే విధంగా జాతీయ జట్టుకు ఆడాలన్న ఆంధ్ర రంజీ ప్లేయర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ చిరకాల ఆకాంక్ష నెరవేరింది. ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సందర్భంగా వీరిద్దరు అరంగేట్రం చేశారు.

గిల్‌కు మొండిచేయి.. ఓపెనర్‌గా రాహుల్‌
స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్‌లో గురువారం ఆరంభమైన తొలి టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. సహచరుల కరతాళ ధ్వనుల నడుమ టీమిండియా క్యాప్‌ అందుకుని మురిసిపోతూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది.

ఇక తొలి టెస్టులో ఇక కేఎస్‌ భరత్‌ వికెట్‌ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. కేఎల్‌ రాహుల్‌.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జోడీగా ఓపెనింగ్‌ చేయనున్నాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌కు మొండిచేయే ఎదురైంది.

టాస్‌ ఓడి
ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌.. ఇద్దరు పేసర్లు మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌తో బరిలోకి దిగింది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన భారత్‌ ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు తొలుత ఫీల్డింగ్‌ చేయనుంది.

ఈ సిరీస్‌ మాకు అత్యంత ముఖ్యమైనది
ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ‘‘మేము టాస్‌ గెలిస్తే కచ్చితంగా బ్యాటింగే ఎంచుకునే వాళ్లం. పిచ్‌ కాస్త పొడిగా అనిపిస్తోంది. స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందనిపిస్తోంది. మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ పిచ్‌ స్వభావం బోధపడుతుంది.

ఈ సిరీస్‌ మాకు అత్యంత ముఖ్యమైనది.. గత ఐదారురోజులుగా మేము నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చాం. పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాం. ఈ మ్యాచ్‌లో మేము ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్లతో బరిలోకి దిగుతున్నాం. భరత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ అరంగేట్రం చేస్తున్నారు’’ అని వెల్లడించాడు.

భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా తొలి టెస్టు తుది జట్లు:
టీమిండియా:
రోహిత్ శర్మ(కెప్టెన్‌), కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా:
డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్‌, స్టీవెన్ స్మిత్, మాట్ రెన్షా, పీటర్ హ్యాండ్స్కాంబ్, అలెక్స్ కారీ(వికెట్‌ కీపర్‌), పాట్ కమిన్స్(కెప్టెన్‌), నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top