రిటైర్మెంట్‌ ప్రకటించిన కోహ్లి | Sakshi
Sakshi News home page

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన కోహ్లి

Published Tue, Feb 20 2024 2:45 PM

Former Mizoram State Captain Taruwar Kohli Announced Retirement From Professional Cricket - Sakshi

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి సహచరుడు, మిజోరాం​ రాష్ట్ర జట్టు మాజీ కెప్టెన్‌ తరువార్‌ కోహ్లి ప్రొఫెషనల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 35 ఏళ్ల తరువార్‌ ప్రొఫెషనల్‌ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ఇవాళ (ఫిబ్రవరి 20) ప్రకటించాడు.

పంజాబ్‌లోని జలందర్‌లో పుట్టి పెరిగిన తరువార్‌.. ఆ రాష్ట్రం తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో మిజోరాంకు వలస వెళ్లాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో మొత్తం 55 మ్యాచ్‌లు ఆడిన తరువార్‌.. 97 ఇన్నింగ్స్‌ల్లో 53.80 సగటున 4573 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 18 అర్దసెంచరీలు ఉన్నాయి. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో తరువార్‌ అత్యధిక స్కోర్‌ 307 నాటౌట్‌గా ఉంది. తరువార్‌ ఖాతాలో రెండు ఫస్ట్‌క్లాస్‌ డబుల్‌ సెంచరీలు ఉన్నాయి.

2008 అండర్‌-19 వరల్డ్‌కప్‌లో విరాట్‌ కోహ్లి సారథ్యంలో ఆడిన తరువార్‌.. ఆ టోర్నీలో వరుసగా మూడు అర్దసెంచరీలు సాధించి, మూడో లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. రైట్‌ హ్యాండ్‌ బ్యాటింగ్‌తో పాటు రైట్‌ ఆర్మ్‌ మీడియం​ పేస్‌ బౌలింగ్‌ వేసే తరువార్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 74, లిస్ట్‌ ఏ క్రికెట్‌లో 41, టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టాడు.

లిస్ట్‌-ఏ, టీ20ల్లోనూ (బ్యాటింగ్‌) తరువార్‌కు మెరుగైన రికార్డే ఉంది. లిస్ట్‌-ఏలో తరువార్‌ 3 సెంచరీలు, 11 హాఫ్‌ సెంచరీల సాయంతో 1913 పరుగులు (72 మ్యాచ్‌ల్లో) చేయగా.. టీ20ల్లో 7 అర్దసెంచరీల సాయంతో 1057 పరుగులు (57 మ్యాచ్‌ల్లో) చేశాడు.

దేశవాలీ క్రికెట్‌తో పాటు తరువార్‌ ఐపీఎల్‌లోనూ ఆడాడు. 2008, 2009 సీజన్లలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన తరువార్‌.. కేవలం 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 2008 అండర్‌-19 వరల్డ్‌కప్‌లో విరాట్‌, తరువార్‌తో పాటు రవీంద్ర జడేజా కూడా యంగ్‌ ఇండియా టీమ్‌కు ప్రాతినిథ్యం వహించారు. 

Advertisement
Advertisement