ఢిల్లీ మళ్లీ మెరిస్తే.. సీఎస్‌కే మళ్లీ ఓడింది | Delhi Capitals Beat CSK By 44 Runs | Sakshi
Sakshi News home page

ఢిల్లీ మళ్లీ మెరిస్తే.. సీఎస్‌కే మళ్లీ ఓడింది

Sep 25 2020 11:07 PM | Updated on Sep 25 2020 11:16 PM

Delhi Capitals Beat CSK By 44 Runs - Sakshi

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌లో  ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో విజయాన్ని నమోదు చేసింది. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా వరుసగా రెండో గెలుపును అందుకుంది. అదే సమయంలో సీఎస్‌కే వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడింది. ఢిల్లీ నిర్దేశించిన 176 పరుగుల ఛేదనలో సీఎస్‌కే ఏడు వికెట్లు కోల్పోయి 131 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఢిల్లీతో మ్యాచ్‌లో సీఎస్‌కేకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు షేన్‌ వాట్సన్‌(17), మురళీ విజయ్‌(10)లు నిరాశపరిచారు. అటు తర్వాత డుప్లెసిస్‌(43; 35 బంతుల్లో 4 ఫోర్లు), కేదార్‌ జాదవ్‌(26;21 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా మిగతా వారు విఫలయ్యారు. రుతురాజ్‌ గైక్వాడ్‌(5) తీవ్రంగా నిరాశపరచగా, ధోని(15) నుంచి మెరుపులు రాలేదు. ఈ మ్యాచ్‌లో ధోని రెండు ఫోర్లు కొట్టడం మినహా ఏమీ ఆకట్టుకోలేదు. జడేజా 12 పరుగుల చేసి ఔటయ్యాడు.ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ధోని బ్యాట్‌ ఝుళిపించడం కష్టమైంది. ఢిల్లీ బౌలర్లలో రబడా మూడు వికెట్లు సాధించగా, నోర్త్‌జే రెండు వికెట్లతో మెరిశాడు. అక్షర్‌ పటేల్‌కు వికెట్‌ దక్కింది.(చదవండి: దాన్ని బట్టే నా బ్యాటింగ్‌ ఆర్డర్‌ : ధోని)

అంతకుముందు  ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. పృథ్వీ షా(64; 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌), శిఖర్‌ ధావన్‌(35; 27 బంతుల్లో  3 ఫోర్లు, 1 ఫోర్‌), శ్రేయస్‌ అయ్యర్‌(26), రిషభ్‌ పంత్‌(37; 25 బంతుల్లో 6 ఫోర్లు)లు రాణించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సీఎస్‌కే తొలుత ఫీల్డింగ్‌ తీసుకోవడంతో ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌కు పృథ్వీ షా, ధావన్‌లు శుభారంభం అందించారు.  వీరిద్దరూ తొలి వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత ధావన్‌ ఔటయ్యాడు. పీయూష్‌ చావ్లా బౌలింగ్‌లో ధావన్‌ ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు. మరో 9 పరుగుల వ్యవధిలో పృథ్వీ షా ఔట్‌ కావడంతో ఢిల్లీ 103 పరుగుల వద్ద రెండో వికెట్‌ను చేజార్చుకుంది. అనంతరం రిషభ్‌ పంత్‌-శ్రేయస్‌ అయ్యర్‌ల జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. ఈ జోడీ 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. సీఎస్‌కే బౌలర్లలో పీయూష్‌ చావ్లా రెండు వికెట్లు సాధించగా, సామ్‌ కరాన్‌కు వికెట్‌కు దక్కింది.(చదవండి: అంబటి రాయుడు ఫిట్‌ కాలేదు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement