గెలుపు జోష్‌లో ఉన్న సీఎస్‌కేకు కొత్త తలనొప్పి | CSK Bowler Joins MS Dhoni In Injured List, Leaves Field In Pain vs KKR | Sakshi
Sakshi News home page

గెలుపు జోష్‌లో ఉన్న సీఎస్‌కేకు కొత్త తలనొప్పి

Apr 15 2026 12:35 PM | Updated on Apr 15 2026 12:56 PM

CSK Bowler Joins MS Dhoni In Injured List, Leaves Field In Pain vs KKR

ఐపీఎల్‌ 2026లో హ్యాట్రిక్‌ పరాజయాల తర్వాత వరుసగా రెండు విజయాలు సాధించి, జోష్‌లో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. నిన్న (ఏప్రిల్‌ 14) కేకేఆర్‌ మ్యాచ్‌లో గాయపడిన పేస్‌ బౌలర్‌ ఖలీల్‌ అహ్మద్‌ తదుపరి మ్యాచ్‌కు అనుమానమని తెలుస్తుంది. ఖలీల్‌ హ్యామ్‌స్ట్రింగ్‌ గాయం నుంచి ఇంకా తేరుకోలేదని సమాచారం. 

కేకేఆర్‌ మ్యాచ్‌లో అతను ఓవర్‌ పూర్తి చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. తన స్పెల్‌ చివరి బంతి (3.5-0-24-1) వేసేందుకు ఎంత ‍ప్రయత్నించినా సాధ్యపడకపోవడంతో మైదానాన్ని వీడాడు. దీంతో మిగిలిన ఆ బంతిని గుర్జ్‌ప్‌న్నీత్‌తో వేయించారు. 

ఖలీల్‌ గాయానికి స్కాన్‌లు చేయగా.. డాక్టర్లు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని సూచించినట్లు సమాచారం​. సీఎస్‌కే తమ తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 18న ఆడనుంది. ఆ సమయానికి ఖలీల్‌ కోలుకోవడం కష్టమేనని తెలుస్తుంది. సీఎస్‌కే తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను వారి సొంత ఇలాకా ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలని సీఎస్‌కే పట్టుదలగా ఉంది. ఈ సమయంలో ఖలీల్‌ అందుబాటులో లేకపోతే, ఆ జట్టు విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.

ధోని అందుబాటులోకి రాకముందే..!
ఈ సీజన్‌ ప్రారంభం ముందు నుంచే సీఎస్‌కేను గాయాల సమస్య వేధిస్తుంది. దిగ్గజ ఆటగాడు ధోని సైడ్‌ స్ట్రెయిన్‌ నుంచి ఇంకా కోలుకోలేదు. మరో కీలక​ ఆటగాడు డెవాల్డ్‌ బ్రెవిస్‌ గాయం నుంచి కోలుకొని కేకేఆర్‌ మ్యాచ్‌తోనే బరిలోకి దిగాడు. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న సీఎస్‌కేను ఖలీల్‌ గాయం కలవరపెడుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా అతనిపై ఒత్తిడి తేకూడదని కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.

నిన్నటి మ్యాచ్‌ విషయానికొస్తే.. కేకేఆర్‌పై  సీఎస్‌కే 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే.. సంజూ శాంసన్‌ (48), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (41), ఆయుశ్‌ మాత్రే (38) రాణించడంతో ని​ర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.

అనంతరం బరిలోకి దిగిన కేకేఆర్‌ నూర్‌ అహ్మద్‌ (4-0-21-3), అన్షుల్‌ కంబోజ్‌ (4-0-32-2), అకీల్‌ హొసేన్‌ (4-0-26-1) ధాటి​కి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. 35 పరుగులు చేసిన రమన్‌దీప్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement