
అవినీతి కేసులో దాదాపు నాలుగేళ్లు నిషేధాన్ని ఎదుర్కొని శ్రీలంకతో ఇవాళ (ఆగస్ట్ 29) జరుగుతున్న మ్యాచ్‌తో వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చిన జింబాబ్వే వెటరన్ స్టార్ బ్రెండన్ టేలర్.. తొలి మ్యాచ్‌లోనే ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో శ్రీలంక నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న క్రమంలో మూడు బంతులు ఆడి డకౌటయ్యాడు. తద్వారా జింబాబ్వే తరఫున వన్డేల్లో అత్యధిక డకౌట్లు అయిన ఆటగాళ్ల జాబితాలో తతెండ టైబు, ప్రాస్పర్ ఉత్సేయతో కలిసి మూడో స్థానంలో నిలిచాడు. టైబు, ఉత్సేయ, బ్రెండన్ వన్డేల్లో తలో 16 సార్లు డకౌట్లయ్యారు. ఈ జాబితాలో గ్రాంట్ ఫ్లవర్ (18) అగ్రస్థానంలో ఉండగా.. ఎల్టన్ చిగుంబర (17) రెండో ప్లేస్‌లో నిలిచాడు.
భారీ అంచనాలతో వన్డేల్లో రీఎంట్రీ ఇచ్చిన బ్రెండన్ తొలి మ్యాచ్‌లోనే తస్సుమనడంతో జింబాబ్వే అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఈ మ్యాచ్‌లో బ్రెండన్ ఫీల్డింగ్ సమయంలోనూ నిరాశపరిచాడు. మ్యాచ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే (రెండో ఓవర్) గాయపడి మైదానాన్ని వీడాడు.
అయితే గాయం చిన్నదే కావడంతో బ్యాటింగ్‌కు దిగిన అతడు.. మూడు బంతుల్లోనే పెవిలియన్ బాట పట్టాడు. వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన 39 ఏళ్ల బ్రెండన్‌కు జింబాబ్వే ఆల్‌టైమ్ గ్రేట్ వన్డే బ్యాటర్లలో ఒకడిగా పేరుంది. ఇతను 206 వన్డేల్లో 11 సెంచరీలు, 39 అర్ద సెంచరీల సాయంతో 6684 పరుగులు చేశాడు. ఇంతటి ఘనమైన ట్రాక్ రికార్డు కలిగిన ఆటగాడిగాపై సహజంగానే అంచనాలు ఉంటాయి. అయితే ఆ అంచనాలకు బ్రెండన్ నీరుగార్చాడు.
శ్రీలంకతో మ్యాచ్‌లో 299 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే.. తొలి బంతికే బ్రియాన్ బెన్నెట్ (0) వికెట్ కోల్పోయింది. అనంతరం నాలుగో బంతికే బ్రెండన్ టేలర్ కూడా పెవిలియన్‌కు చేరాడు. దీంతో జింబాబ్వే తొలి ఓవర్‌లో ఖాతా కూడా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో బెన్ కర్రన్, కెప్టెన్ సీన్ విలియమ్స్ అద్భుతమైన అర్ద సెంచరీలు చేసి జింబాబ్వేను ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 118 పరుగులు జోడించారు. 57 పరుగుల వద్ద విలియమ్స్ ఔట్ కాగా.. కర్రన్ (70 నాటౌట్), సికందర్ రజా (7) ఛేదనను కొనసాగిస్తున్నారు. 25.4 ఓవర్ల తర్వాత జింబాబ్వే స్కోర్ 140/3గా ఉంది. లంక బౌలర్లలో అషిత ఫెర్నాండో 2, కమిందు మెండిస్ ఓ వికెట్ తీశారు.
అంతకుముందు శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనర్ పథుమ్ నిస్సంక (92 బంతుల్లో 76; 12 ఫోర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆఖర్లో జనిత్ లియనాగే (47 బంతుల్లో 70 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కమిందు మెండిస్ (36 బంతుల్లో 57; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు.