Rafael Nadal: రాకెట్‌ పట్టుకుని మళ్లీ కోర్టులో అడుగు పెడతానో లేదో అనుకున్నా కానీ.. ఇప్పుడు: నాదల్‌ భావోద్వేగం

Australia Open 2022: Rafael Nadal Creates History Gets Emotional Check Stats - Sakshi

నమో నాదల్‌

స్పెయిన్‌ స్టార్‌ ఖాతాలో 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌

Australia Open 2022- Rafael Nadal Emotional Words: అద్భుతం... అసమానం... అసాధారణం... చిరస్మరణీయం... ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ కోసం రాఫెల్‌ నాదల్, డానిల్‌ మెద్వెదెవ్‌ పోరాడిన తీరును ఎన్ని విశేషణాలతో ప్రశంసించినా తక్కువే అవుతుంది. ఒకటా.. రెండా... మూడా... ఏకంగా 5 గంటల 24 నిమిషాలపాటు ఇద్దరూ కొదమ సింహాల్లా పోరాడారు. చివరకు 63 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు ఆడిన అపార అనుభవంతో రాఫెల్‌ నాదల్‌ పైచేయి సాధించాడు.

రెండోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌గా నిలవడంతోపాటు పురుషుల టెన్నిస్‌ చరిత్రలో అత్యధికంగా 21 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ గెలిచిన ప్లేయర్‌గా కొత్త చరిత్రను లిఖించాడు. ఈ టోర్నీకి ముందు ‘దిగ్గజ త్రయం’ నాదల్, ఫెడరర్, జొకోవిచ్‌ 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో సమఉజ్జీగా ఉన్నారు. తాజా విజయంతో ఫెడరర్, జొకోవిచ్‌లను వెనక్కి నెట్టి 35 ఏళ్ల నాదల్‌ ముందుకొచ్చాడు. సమీప భవిష్యత్‌లో నాదల్‌ను అధిగమించే అవకాశం కేవలం 34 ఏళ్ల జొకోవిచ్‌కు మాత్రమే ఉంది. గాయాలతో సతమతమవుతున్న 40 ఏళ్ల ఫెడరర్‌ కెరీర్‌ ముగింపు దశకు చేరుకుంది.

మెల్‌బోర్న్‌: వరుసగా రెండు సెట్‌లు చేజార్చుకొని ఇక ఓటమి తప్పదేమో అనుకుంటున్న తరుణంలో స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ నేలకు కొట్టిన టెన్నిస్‌ బంతిలా ఒక్కసారిగా పైకి లేచాడు. అంతర్జాతీయ టెన్నిస్‌లో తనకున్న 21 ఏళ్ల అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. ఒక్కో పాయింట్‌ గెలుస్తూ ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకున్నాడు. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. వెరసి రెండోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌గా నిలిచాడు.

తన కెరీర్‌లో 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను గెల్చుకున్నాడు. తద్వారా పురుషుల టెన్నిస్‌ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారిడిగా ఆవిర్భవించాడు. ఆదివారం రాడ్‌ లేవర్‌ ఎరీనాలో 5 గంటల 24 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ 2–6, 6–7 (5/7), 6–4, 6–4, 7–5తో రెండో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా)పై అద్భుత విజయం సాధించాడు. నాదల్‌కు 28 లక్షల 75 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ. 15 కోట్ల 9 లక్షలు)... రన్నరప్‌ మెద్వెదెవ్‌కు 15 లక్షల 75 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ. 8 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 

తొలి రెండు సెట్‌లు కోల్పోయినా... 
గత ఏడాది ఈ టోర్నీ ఫైనల్లో జొకోవిచ్‌ చేతిలో ఓడిన మెద్వెదెవ్‌ ఈసారి మాత్రం నాదల్‌పై శుభారంభం చేశాడు. తొలి సెట్‌ను, రెండో సెట్‌ను సొంతం చేసుకొని విజయానికి ఒక సెట్‌ దూరంలో నిలిచాడు. రెండు సెట్‌లు వెనుకబడ్డా నాదల్‌ మాత్రం తన పోరాటాన్ని ఆపలేదు. తన అపార అనుభవాన్ని రంగరించి పాయింట్‌ పాయింట్‌ కోసం పోరాడాడు. ముఖ్యంగా నాదల్‌ కొట్టిన కొన్ని బ్యాక్‌హ్యాండ్‌ షాట్‌లకు మెద్వెదెవ్‌ వద్ద సమాధానం లేకపోయింది. పాయింట్ల కోసం ఎన్నోసార్లు సుదీర్ఘ ర్యాలీలు సాగాయి. కొన్నిసార్లు నాదల్, మరికొన్నిసార్లు మెద్వెదెవ్‌ పైచేయి సాధించారు. మూడో సెట్‌లోని తొమ్మిదో గేమ్‌లో మెద్వెదెవ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన నాదల్‌ పదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌ను గెలిచాడు.

నాలుగో సెట్‌లో మూడో గేమ్‌లో మెద్వెదెవ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసినా వెంటనే నాలుగో గేమ్‌లో నాదల్‌ తన సర్వీస్‌ను కోల్పోయాడు. తర్వాత ఐదో గేమ్‌లో మెద్వెదెవ్‌ సర్వీస్‌ను మళ్లీ బ్రేక్‌ చేసిన నాదల్‌ అదే జోరులో నాలుగో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక నిర్ణాయక ఐదో సెట్‌లోని ఐదో గేమ్‌లో మెద్వెదెవ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన అదే దూకుడు కొనసాగించి 5–4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ దశలో పదో గేమ్‌లో నాదల్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన మెద్వెదెవ్‌ స్కోరును 5–5తో సమం చేశాడు. అయితే 11వ గేమ్‌లో మెద్వెదెవ్‌ సర్వీస్‌ను మళ్లీ బ్రేక్‌ చేసిన నాదల్‌ 12వ గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని విజయం ఖరారు చేసుకున్నాడు.

‘గ్రాండ్‌’ ఆధిక్యం చేతులు మారిన వేళ...
2022 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌: 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో జొకోవిచ్, ఫెడరర్‌లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచిన నాదల్‌ 21వ ‘గ్రాండ్‌’ టైటిల్‌తో ఒంటరిగా ఆధిక్యంలోకి వచ్చాడు. 
2009 వింబుల్డన్‌: 14 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో పీట్‌ సంప్రాస్‌ పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తూ ఫెడరర్‌ 15వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో ఆధిక్యంలోకి వచ్చాడు. 
2000 వింబుల్డన్‌: 12 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో రాయ్‌ ఎమర్సన్‌ పేరిట ఉన్న రికార్డును సవరిస్తూ సంప్రాస్‌ 13వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో ఆధిక్యంలోకి వచ్చాడు.

అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ వీరులు (కనీసం 10) 
రాఫెల్‌ నాదల్‌-    (స్పెయిన్‌)    21 
జొకోవిచ్‌-    (సెర్బియా)    20 
ఫెడరర్‌-    (స్విట్జర్లాండ్‌)    20 
పీట్‌ సంప్రాస్‌-    (అమెరికా)    14
రాయ్‌ ఎమర్సన్‌-    (ఆస్ట్రేలియా)    12
జాన్‌ బోర్గ్‌  -  (స్వీడన్‌)    11
రాడ్‌ లేవర్‌-    (ఆస్ట్రేలియా)    11
బిల్‌ టిల్డెన్‌  -  (అమెరికా)    10

ఫైనల్‌ గణాంకాలు...
నాదల్‌-    మెద్వెదెవ్‌
3    ఏస్‌లు    23
5    డబుల్‌ ఫాల్ట్‌లు    5 
7/23    బ్రేక్‌ పాయింట్లు    6/22
30/50    నెట్‌ పాయింట్లు    28/50 
69    విన్నర్స్‌    76 
68    అనవసర తప్పిదాలు    52 
182    మొత్తం పాయింట్లు    189

నాదల్‌ భావోద్వేగం..
నిస్సందేహంగా నా టెన్నిస్‌ కెరీర్‌లో అత్యంత భావోద్వేగ మ్యాచ్‌ ఇది. నిజాయతీగా చెప్పాలంటే నెలన్నర రోజుల క్రితం అసలు టెన్నిస్‌ రాకెట్‌ పట్టుకొని మళ్లీ కోర్టులో అడుగు పెడతానో లేదోననే సందిగ్ధావస్థలో ఉన్నాను. ఇప్పుడు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విన్నర్స్‌ ట్రోఫీతో మీ ముందు ఉన్నాను. నాలో ఇంకా గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచే శక్తి ఉందని తెలిసింది. తప్పకుండా వచ్చే ఏడాది కూడా ఈ టోర్నీలో ఆడతాను. మెద్వెదెవ్‌ అసాధారణంగా పోరాడాడు.

భవిష్యత్‌లో కచ్చితంగా అతడిని కూడా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌గా చూస్తాం. ఆస్ట్రేలియాలో గత మూడు వారాలుగా నాకు లభించిన ఆదరణ, ఆప్యాయత జీవితాంతం నా హృదయంలో ఉండిపోతుంది.  –రాఫెల్‌ నాదల్‌

అద్భుత రికార్డులు:
టెన్నిస్‌లో ఓపెన్‌ శకం (1968 నుంచి) మొదలయ్యాక ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో తొలి రెండు సెట్‌లు కోల్పోయాక కూడా విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌ నాదల్‌. 
గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో సుదీర్ఘంగా సాగిన రెండో ఫైనల్‌గా నాదల్, మెద్వెదెవ్‌ మ్యాచ్‌ నిలిచింది. జొకోవిచ్, నాదల్‌ మధ్య 2012 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో జరిగిన మ్యాచ్‌ (5 గంటల 53 నిమిషాలు) సుదీర్ఘంగా జరిగిన గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌గా గుర్తింపు పొందింది.  
టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలను కనీసం రెండుసార్లు చొప్పున గెలిచిన నాలుగో ప్లేయర్‌ నాదల్‌.
ఈ జాబితాలో జొకోవిచ్‌ (సెర్బియా), రాయ్‌
ఎమర్సన్‌ (ఆస్ట్రేలియా), రాడ్‌ లేవర్‌ (ఆస్ట్రేలియా) కూడా ఉన్నారు. 
తన కెరీర్‌ మొత్తంలో మ్యాచ్‌లో తొలి రెండు సెట్‌లు చేజార్చుకొని ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లు గెలిచి విజేతగా నిలువడం నాదల్‌కిది నాలుగోసారి మాత్రమే. గతంలో నాదల్‌ 2007 వింబుల్డన్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మిఖాయిల్‌ యూజ్నీ (రష్యా)పై... 2006 వింబుల్డన్‌ రెండో రౌండ్‌లో రాబర్ట్‌ కెండ్రిక్‌ (అమెరికా)పై... 2005 మాడ్రిడ్‌ ఓపెన్‌లో లుబిసిచ్‌ (క్రొయేషియా)పై ఇలా గెలిచాడు.

నాదల్‌ 21 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌- 2009, 2022
ఫ్రెంచ్‌ ఓపెన్‌- 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020
వింబుల్డన్‌- 2008, 2010
యూఎస్‌ ఓపెన్‌- 2010, 2013,  2017, 2019

ప్రశంసల జల్లు:
‘ఆహా ఏమి మ్యాచ్‌ ఆడావు. 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించిన నా మిత్రుడు, గొప్ప ప్రత్యర్థి నాదల్‌కు హృదయపూర్వక అభినందనలు. చాంపియన్స్‌ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు.’ –ఫెడరర్‌

‘అద్భుతమైన ఘనత. నాదల్‌ మరోసారి నీ అసమాన పోరాటంతో ఆకట్టుకున్నావు.’–జొకోవిచ్‌  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top