
న్యూఢిల్లీ: ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును గురువారం ప్రకటించారు. 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు జార్ఖండ్‌కు చెందిన 23 ఏళ్ల సలీమా టెటె సారథ్యం వహిస్తుంది. సెప్టెంబరు 5 నుంచి 14వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీకి చైనాలోని హాంగ్జౌ నగరం ఆతిథ్యమిస్తుంది. గ్రూప్ ‘బి’లో జపాన్, థాయ్‌లాండ్, సింగపూర్ జట్లతో కలిసి భారత్‌కు చోటు లభించింది.
సెప్టెంబరు 5న థాయ్‌లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్... 6న జపాన్‌తో, 8న సింగపూర్‌తో పోటీపడుతుంది. గ్రూప్ ‘ఎ’లో చైనా, చైనీస్ తైపీ, దక్షిణ కొరియా, మలేసియా జట్లున్నాయి.
ఆసియా కప్‌లో విజేతగా నిలిచిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం–నెదర్లాండ్స్‌లో జరిగే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన ఆసియా కప్‌లో భారత జట్టు రెండుసార్లు (2004, 2017) చాంపియన్‌గా, రెండుసార్లు రన్నరప్‌గా (1999, 2009) నిలిచింది.
భారత మహిళల హాకీ జట్టు:
బన్సరీ సోలంకి, బిచ్చూ దేవి ఖరీబమ్ (గోల్ కీపర్లు), మనీషా చౌహాన్, ఉదిత, జ్యోతి, సుమన్ దేవి థౌడమ్, నిక్కీ ప్రధాన్, ఇషిక చౌధరీ (డిఫెండర్లు), నేహా, వైష్ణవి విఠల్ ఫాల్కే, సలీమా టెటె, షర్మిలా దేవి, లాల్‌రెమ్‌సియామి, సునీలితా టొప్పో (మిడ్ ఫీల్డర్లు), నవ్‌నీత్ కౌర్, రుతుజా పిసాల్, బ్యూటీ డుంగ్‌డుంగ్, ముంతాజ్ ఖాన్, దీపిక, సంగీత కుమారి (ఫార్వర్డ్స్).
ఇదీ చదవండి: రజత పతకాలు నెగ్గిన రీనా, ప్రియ
సమోకోవ్ (బల్గేరియా): ప్రపంచ అండర్–20 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో గురువారం భారత్‌కు రెండు రజత పతకాలు లభించాయి. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో రీనా (55 కేజీలు), ప్రియ (76 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలను గెల్చుకున్నారు. ప్రియ 0–4తో నదియా సొకోలవ్‌స్కా (ఉక్రెయిన్) చేతిలో, రీనా 2–10తో ఎవరెస్ట్ లెడెకర్ (అమెరికా) చేతిలో పరాజయం పాలయ్యారు.
మరోవైపు 72 కేజీల విభాగంలో కాజల్ ఫైనల్లోకి దూసుకెళ్లి స్వర్ణ పతకం కోసం పోరాడనుంది. సెమీఫైనల్లో కాజల్ 13–6తో జాస్మిన్ (అమెరికా)పై విజయం సాధించింది. 50 కేజీల విభాగంలో శ్రుతి... 53 కేజీల విభాగంలో సారిక కాంస్య పతకాల కోసం పోటీపడనున్నారు. సెమీఫైనల్స్‌లో సారిక 0–10తో అనస్తాసియా పొలాస్కా (ఉక్రెయిన్) చేతిలో... శ్రుతి 0–11తో రింకా ఒగావా (జపాన్) చేతిలో ఓడిపోయారు.