Asia Cup 2022: మీరు ఇండియా నుంచి వచ్చారా? సంతోషంగా ఉన్నారనుకుంటా: రమీజ్‌ రాజా దురుసు ప్రవర్తన.. వైరల్‌

Asia Cup 2022: Aap India Se Honge PCB Ramiz Raja Snatch Journo Phone - Sakshi

పీసీబీ చీఫ్‌ అనుచిత ప్రవర్తన... ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

Asia Cup 2022 Final SL Vs Pak- Winner Sri Lanka: పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌, ఆ దేశ మాజీ క్రికెటర్‌ రమీజ్‌ రజా అనుచిత ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. ఓటమి బాధను జీర్ణించుకోలేక తన అసహనాన్ని ఓ జర్నలిస్టుపై ప్రదర్శించాడు. తన దురుసు ప్రవర్తన కారణంగా విమర్శల పాలయ్యాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఆసియా కప్‌-2022 టీ20 టోర్నీలో పాకిస్తాన్‌ ఫైనల్లో శ్రీలంకతో తలపడిన విషయం తెలిసిందే.

దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 23 పరుగులతో లంక.. పాక్‌ను చిత్తు చేసి విజేతగా అవతరించింది. ఆరవసారి ఆసియా కప్‌ ట్రోఫీని ముద్దాడి ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూ బాధలో మునిగిపోయిన తమ దేశ ప్రజల మోములు నవ్వులతో వికసించేలా చేసింది దసున్‌ షనక బృందం.

ఇదిలా ఉంటే.. తుది మెట్టుపై బోర్లా పడ్డ పాకిస్తాన్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ వీక్షించిన రమీజ్‌ రజాను.. పాక్‌ ఓటమి అనంతరం విలేకరులు పలకరించారు. ఈ సందర్భంగా.. రోహిత్‌ జుల్గన్‌ అనే జర్నలిస్టు.. ‘‘ఈ ఓటమి కారణంగా పాకిస్తాన్‌ అభిమానులు నిరాశచెంది ఉంటారు కదా’’ అని ప్రశ్నించారు.

మీరు ఇండియా నుంచి వచ్చారా?
ఇందుకు స్పందించిన రమీజ్‌ రాజా.. ‘‘బహుశా మీరు భారత్‌కు చెందిన వారు అనుకుంటా? మీరు చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు కదా?’’ అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. అంతటితో ఆగకుండా.. జర్నలిస్టు మీదమీదకు వస్తూ.. ఆయన ఫోన్‌ లాక్కొన్నాడు. 

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను రోహిత్‌ తన ట్విటర్‌ అకౌంట్‌లో షేర్‌ చేయగా వైరల్‌ అవుతున్నాయి. ‘‘నేను అడిగిన ప్రశ్నలో తప్పేముంది? పాకిస్తాన్‌ ఫ్యాన్స్‌ ఈ ఓటమితో బాధకు లోనై ఉంటారు కదా అన్నాను. కానీ మీరిలా నా ఫోన్‌ తీసుకోవడం సరైంది కాదు మిస్టర్‌ చైర్మన్‌’’ అని రమీజ్‌ రాజాను ట్యాగ్‌ చేశారు. 

ఇక దీనిపై స్పందించిన నెటిజన్లు రమీజ్‌ రాజా తీరును ఏకిపారేస్తున్నారు. ‘‘ఆయన అంత స్పష్టంగా చెబుతున్నా.. మీరు సంతోషంగా ఉన్నారని మీ ముఖమే చెబుతోందంటూ అసహనం ప్రదర్శించడం సరికాదు. బోర్డు చైర్మన్‌వి.. అందునా ఆటగాడివి.. క్రీడాస్ఫూర్తి తెలియదా? 

ఓటమిని హుందాగా అంగీకరించే మనస్తత్వం లేనపుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఇలాంటి దురుసు ప్రవర్తన కారణంగా ఓటమి కంటే ఎక్కువ విమర్శలు మూటగట్టుకుంటారు’’ అంటూ పాక్‌, భారత నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: SL Vs Pak: అలా అయితే రాజపక్స ఇన్నింగ్స్‌కు విలువే ఉండేది కాదు! కానీ..
SL Vs Pak: అందుకే లంక చేతిలో ఓడిపోయాం.. ఓటమికి ప్రధాన కారణం అదే: బాబర్‌ ఆజం
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌.. టీమిండియా కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top