Ashes 2021- 22: 134.1 స్పీడ్‌.. బొక్కబోర్లా పడ్డాడు.. ఇంత వరకు ఇలా అవుటవడం చూడలే!.. వీడియో వైరల్‌

Ashes 2021 22: Marnus Labuschagne Weirdly Gets Out Video Goes Viral - Sakshi

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్లు విఫలమైన వేళ మార్నస్‌ లబుషేన్‌ కంగారూల పాలిట ఆశాదీపంగా నిలిచాడు. వార్నర్‌ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరగగా... ‘సెంచరీల’ వీరుడు ఉస్మాన్‌ ఖవాజా 6 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. ఇలాంటి సమయంలో ట్రవిస్‌ హెడ్‌తో కలిసి జట్టును ఆదుకున్నాడు లబుషేన్‌. 53 బంతులు ఎదుర్కొన్న అతడు 44 పరుగులు చేశాడు. ​

అయితే, 9 ఫోర్లు బాది జోరు మీదున్న లబుషేన్‌ విచిత్రకర రీతిలో అవుట్‌ కావడం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇంగ్లండ్‌ సీనియర్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ 23వ ఓవర్‌లో 134.1 స్పీడ్‌తో బంతిని సంధించాడు. ఈ క్రమంలో అదుపు తప్పిన లబుషేన్‌... ఒక్కసారిగా బొక్కబోర్లాపడిపోయాడు. ఇంకేముంది.. బంతి వికెట్లను గిరాటేయడం.. బెయిల్స్‌ కిందపడటం చకచకా జరిగిపోయాయి. 

పట్టుదలగా నిలబడి ఇన్నింగ్స్‌ చక్కదిద్దుతున్న లబుషేన్‌ను బౌల్డ్‌ చేసిన ఆనందంలో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు సంబరాలు చేసుకోగా.. ఊహించని పరిణామంతో కంగుతిన్న ఆసీస్‌ బ్యాటర్‌ నిరాశగా పెవిలియన్‌ చేరాడు. ఇక ఆసీస్‌ ఇప్పటికే 3-0 తేడాతో ఆసీస్‌ సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగో టెస్టు డ్రాకాగా... ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించి పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్‌ భావిస్తోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top