
బెజుగామలో బయటపడ్డ సతిశిల
గజ్వేల్‌రూరల్: శిలలు చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయని, ఆ చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజుగామలో ఇటీవల జైన తీర్థంకరుల శిల్పాలు వెలుగుచూడగా, తాజాగా ఇదే గ్రామంలో అపూర్వ సతిశిలతో పాటు శూలరోహణ ఆత్మాహుతి, ఇతర వీరగల్లులను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు గుర్తించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ శిల్పంలో వీరుడు తలపై పెద్దసిగతో, చెవులకు జూకాలు, మెడలో కంటె, జంధ్యం, హస్తభూషణాలు, నడుమున దట్టి, వీరకాసె, చేతులలో ఈటెతో, డాకాలు సాచి, యుద్ధానికి సిద్ధమై ఉన్నాడని తెలిపారు. ఈ వీరునికి కుడిపక్క పెద్ద ధమ్మిల్లంతో, చెవులకు జూకాలతో, మెడలో హారం, చేతులలో ఈటెతో శత్రువును చంపుతున్న వీరనారి నిలబడి ఉందన్నారు. వీరునికి ఎడమవైపున పెద్ద ధమ్మిల్లంతో, జూకాలతో, మెడలో హారంతో, ఎడమచేత కమండలం పట్టుకొని కనిపిస్తున్న సీ్త్ర ఆ వీరుని సతి అని పేర్కొన్నారు. కుడిపక్కన ఈటెతో శత్రువుని చంపుతున్న ఆ నారీమణి కూడా వీరపత్నే అయి ఉండవచ్చని చెప్పారు. ఈ వీరునికి ఇద్దరు భార్యలున్నట్లు తెలుస్తుందన్నారు. అక్కడ జరిగిన పోరులో భర్తతోపాటు పోరాడిన భార్య కూడా చనిపోగా, మిగిలిన మరో భార్య భర్తతో పాటు సతీసహగమనం చేసినట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సతిశిల కల్యాణి చాళుక్యుల కాలానికి చెందినదని చరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. ఈ పరిశీలనలో చరిత్రకారుల బృందం వెంట గ్రామస్తులు నాంపల్లి స్వామి, శ్యామ్‌కుమార్, కళాధర్‌లు పాల్గొన్నారు.