
రాలిన ఆశలు.. నష్టాల్లో రైతులు
అకాల వర్షాలకు దెబ్బతిన్న మామిడి పంటలు
● అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడలో
2,991 ఎకరాల్లో సాగు
● మార్కెట్‌లోనూ ధర అంతంత మాత్రమే
● నష్ట పరిహారం ఇవ్వాలని రైతుల వినతి
టన్నుకు రూ.15 వేలు దాటని వైనం
కోహెడ(హుస్నాబాద్): ఆరుగాలం శ్రమించిన మామిడి రైతులకు నిరాశే దక్కింది. ఇటీవల కురిసిన గాలివానలతో కోత దశలో ఉన్న మామిడి కాయలు నేలరాలాయి. గాలి తీవ్రతకు చెట్ల కొమ్మలు సైతం విరిగి పడ్డాయి. దీంతో తీవ్ర స్థాయిలో తోటలు దెబ్బతిన్నాయి. ఫిబ్రవరి నుంచి ఎండల తీవ్రత పెరిగింది. నీటి ఎద్దడితో చిరుకాయ దశలో ఉన్న మామిడి తోటలు సగానికి పైగా నేల రాలడంతో నష్టాల్లో మునిగిపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలతో నేలరాలిన మామిడి కాయలను మార్కెట్‌కు తరలించిన రైతులకు టన్నుకు రూ.15 వేలు ధర అందని పరిస్థితి నెలకొంది. తోటలను ముందస్తుగా మాట్లాడుకున్న పలువురు వ్యాపారులు సైతం చేతులెత్తేశారు. గొట్లమిట్ట, కోహెడ, చెంచల్ చెర్వుపల్లి, తీగలకుంటపల్లి, వరికోలు, బస్వాపూర్, కాచాపూర్, సముద్రాల, శ్రీరాములపల్లి, కూరెల్లా, తంగాళ్లపల్లి, వింజపల్లి తదితర గ్రామాల్లో ఉద్యానశాఖ అధికారుల వివరాల ప్రకారం 1,350 ఎకరాలు మామిడి సాగు అవుతుంది. ఆకాల వర్షాలు, వాతావరణ మార్పులతో మామిడి పూత, కాత నిలువలేదు. కాస్తోకుస్తో నిలిచిన మామిడి కాయలు గాలివానకు పూర్తిగా నేలరాలాయి. హుస్నాబాద్ నియోజక వర్గంలోని కోహెడ, అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో సుమారు 2,991 ఎకరాలు మామిడి
సాగు చేస్తున్నారు.
పంట నష్టంపై సర్వే నిర్వహిస్తున్న అధికారులు
పంట నష్టం వివరాలు సేకరణ
ఉద్యానశాఖ అధికారులు ఆకాల వర్షాలతో నష్టపోయిన మామిడి తోటల వివరాలు సేకరించడంలో బిజీబిజీగా ఉన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం కోహెడ మండల వ్యాప్తంగా 407 మంది రైతులకు చెందిన 1,255 ఎకరాల్లో 33 శాతం మామిడి దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. కాగా 90 శాతం మామిడి దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. వివరాలు పారదర్శంగా నమోదు చేయాలని రైతులు కోరుతున్నారు.

రాలిన ఆశలు.. నష్టాల్లో రైతులు