
వేర్వేరు చోరీల కేసులో ఇద్దరు రిమాండ్
సిద్దిపేటకమాన్: బైక్‌ల చోరీకి పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సిద్దిపేట ఏసీపీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి వద్ద గతేడాది మే నెలలో ద్విచక్ర వాహనాన్ని, ఈ ఏడాది జనవరిలో కోటిలింగాల టెంపులు వద్ద, రైతు బజార్ వద్ద, దుబ్బాకలో పార్క్ చేసిన బైక్‌లను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేట వన్ టౌన్ సీఐ వాసుదేవరావు, ఎస్‌ఐ నవత తమ సిబ్బందితో కలిసి సోమవారం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన శనిగరం శ్రీకాంత్ (30) పోలీసులను చూసి బైక్ వదిలిపెట్టి పారిపోతుండగా పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారించగా పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలించి ఇంట్లో భద్రపర్చి తర్వాత ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు నిందితుడు చేసిన నేరాలు ఒప్పుకున్నాడు. వెంటనే రూ.2,55,000 విలువ గల ఐదు బైక్‌లను స్వాధీనం చేసుకొని, నిందితుడిని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబర్చిన సీఐ వాసుదేవరావు, ఎస్‌ఐ నవత, సిబ్బంది భూమలింగం, శరత్‌బాబు, శేఖర్, రామకృష్ణను ఏసీపీ అభినందించి, సీపీ చేతుల మీదుగా రివార్డు అందజేస్తామని తెలిపారు.
పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన ఆటో డ్రైవర్
పటాన్‌చెరు టౌన్: వృద్ధురాలి పుస్తెలతాడు, నగదు ఎత్తుకెళ్లిన కేసులో ఆటో డ్రైవర్‌ను రిమాండ్ చేసిన ఘటన అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన భారతి 9న బొల్లారం అల్వాల్‌లో ఉండే తన ఇంటికి వెళ్లి అక్కడ కిరాయిదారుడు నుంచి రూ.10 వేలు అద్దె తీసుకుంది. తిరిగి అదే రోజు సాయంత్రం కూకట్‌పల్లి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆటో డ్రైవర్ వృద్ధురాలిని పలు వీధుల మీదుగా తిప్పి చివరకు అమీన్‌పూర్ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి ఐదున్నర తులాల పుస్తెలతాడు, రూ.10 వేల నగదు తీసుకొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాను పరిశీలించి ఆటో నంబర్ ఆధారంగా డ్రైవర్‌ను గుర్తించారు. కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం మాదపురం కాలనీకి చెందిన ముడావత్ చిన్నను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించి అతడి వద్ద నుంచి పుస్తెలతాడు, రూ.7వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కి తరలించారు.
సిద్దిపేటలో పార్కు చేసిన బైక్‌లు దొంగతనం