
‘ఉపాధి’లో మరింత పారదర్శకత
● ఉపాధి పర్యవేక్షణకు కమిటీలు ● ఐదుగురు సభ్యులతో వీఎంసీల ఏర్పాటు ● 619 గ్రామ పంచాయతీల్లో ఉపాధి అమలు
సంగారెడ్డి జోన్: గ్రామీణ ప్రాంతాల్లోని వలసలు నివారించేందుకు స్థానికంగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను పర్యవేక్షించి మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వేలాదిమంది సద్వినియోగం చేసుకుని, ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు.
ప్రతి గ్రామంలో వీఎంసీ కమిటీ ఏర్పాటు
జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలవుతున్న ప్రతీ గ్రామంలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ (వీఎంసీ)లను ఏర్పాటు చేశారు. కమిటీలో ఆ గ్రామంలో పనిచేసే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, అంగన్‌వాడీ టీచర్, స్వయం సహాయక సంఘాల సభ్యురాలు, రిసోర్స్ పర్సన్, యువత సభ్యులుగా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. జిల్లాలో 619 గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకం అమలు అవుతుంది. ప్రస్తుతం ఆయా గ్రామ పంచాయతీలలో పనులు జోరుగా సాగుతున్నాయి.
రాష్ట్ర అధికారులకు కమిటీల నివేదికలు
గ్రామాలలో ఏర్పాటుచేసిన వీఎంసీ కమిటీల నివేదికలను మండల అధికారులు జిల్లా అధికారులకు పంపించారు. జిల్లా అధికారులు పూర్తి నివేదికలు సిద్ధం చేసి రాష్ట్ర అధికారులకు పంపించారు. ఆరు నెలలపాటు ఈ కమిటీలు ఉపాధిలో ప్రాతినిధ్యం వహించనున్నాయి.
కమిటీ సభ్యుల తనిఖీలు, పర్యవేక్షణ
ఈ పథకంలో చేపట్టిన పనులకు సామాజిక తనిఖీ నిర్వహించి అవకతవకలను గుర్తించేది. దాంతోపాటే గ్రామస్థాయిలో ఏర్పాటుచేసిన వీఎంసీలు ఉపాధి పనులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి పర్యవేక్షించనున్నారు. తనిఖీల్లో భాగంగా చేపట్టిన పనిపేరు, హాజరైన కూలీల సంఖ్య, పనులకు సంబంధించిన రికార్డులు, అధికారులు ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేపట్టారా లేదా, చేపట్టిన పనుల్లో నాణ్యత, మాస్టర్‌లతోపాటు రిజిస్టర్ల తనిఖీ చేపట్టనున్నారు. కమిటీల పర్యవేక్షణతో చేపట్టే పనిలో పారదర్శకత పెంపొందనుంది. అంతేకాకుండా పనులలో నాణ్యత పెంపొంది అవకతవకలకు తావు లేకుండా పనులు కొనసాగనున్నాయి.