
ఉద్యాన సాగుకు రాయితీలు
● పండ్ల తోటలు, కూరగాయల సాగు, యంత్ర పరికరాలకు రాయితీలు ● జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 27,633 ఎకరాలు
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ఉద్యాన పంటల సాగుపెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకంలో భాగంగా ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఉద్యాన పంట సాగువైపు రైతులు మొగ్గు చూపేందుకు వారికి ఆయా పంటల సాగు, యంత్రపరికరాలపై రాయితీలను కల్పించనుంది. పండ్ల తోటలు, పూల సాగు,కూరగాయల సాగుకు సబ్సిడీలతోపాటు యంత్రాలు, యంత్ర పరికరాలు, సూక్ష్మ నీటి సేద్యానికి 2025–2026 ఏడాదికి ఉద్యానవన శాఖ రాయితీలను అందిస్తోంది. జిల్లాలో ఉద్యాన పంటలు 27,633 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతుండగా ఈ ఏడాది అదనంగా 1,094 ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
పండ్ల తోటలకు (హెక్టారుకు)...
హెక్టారు మామిడి పంటకు రూ. 19,200, నిమ్మ రూ. 19,200, జామ రూ.19,200,అరటి రూ. 16,800, బొప్పాయి రూ. 7,200, డ్రాగన్ ఫ్రూట్ రూ. 64,800, దానిమ్మ రూ.19,200, ముదురు మామిడి తోటల పునరుద్ధరణకు రూ. 9,600ను ప్రోత్సాహకాన్ని అందజేయనున్నారు.
కూరగాయల పంటలకు (ఎకరాకు)
టమాటా పంట రూ. 9,600, వంగ రూ. 9,600, క్యాబేజీ రూ. 9,600, క్యాలీఫ్లవర్ రూ. 9,600, మిర్చి నారుకు రూ. 9,600ల సబ్సిడీ ఇవ్వనున్నారు. ప్లాస్టిక్ మల్చింగ్ వేసుకునే రైతులకు ఎకరాకు రూ. 8 వేలు, తీగజాతి కూరగాయల సాగు శాశ్వత పందిళ్ల నిర్మాణం కోసం ఎకరానికి రూ.లక్ష, పూల రైతులకు ఎకరాకు రూ. 8 వేలు రాయితీగా అందించనుంది.
ఆయిల్‌పామ్ సాగుకు...
రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును పెంచాలనే లక్ష్యంతో ఎకరాకు మూడేళ్ల బిందు సేద్యంతో కలిపి రూ.50,918లను సబ్సిడీ రూపంలో అందజేస్తుంది. ఈ ఏడాది ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని 3,050 ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
యంత్రాలు...
● ఉద్యాన పంటల సాగుకు 20 హెచ్‌పీ ట్రాక్టరుకు రూ. 2.45 లక్షల సబ్సిడీ, పవర్‌టిల్లర్‌కు రూ. లక్ష,
● పవర్ వీడర్‌కు రూ.75వేలు, బ్రష్ కట్టర్స్ రూ. 25 వేల సబ్సిడీని అందజేయనున్నారు.
సూక్ష్మ నీటి సేద్యం...
సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం అందజేస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యాన పంటలతోపాటు కూరగాయల సాగుకు, ఇతర పంటల సాగుకు ప్రోత్సాహం అందుతుంది. ఉద్యాన పంటలసాగు ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. డ్రిప్‌ను కూడా సబ్సిడీపై అందజేస్తాం. ఆయిల్‌పామ్ సాగును విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించాం.
–సోమేశ్వర్ రావు, ఉద్యాన, పట్టు పరిశ్రమల జిల్లా అధికారి, సంగారెడ్డి
ప్రైమ్‌మినిస్టర్ క్రిషి సించాయి యోజన పథకం కింద పండ్ల తోటలతోపాటు కూరగాయలకు, మిరప, ఆయిల్‌పామ్ సాగుకు బిందు,తుంపర సేద్యం చేసేందుకు అవసరమైన పరికరాలను కూడా రాయితీపై అందించనున్నారు. ఎస్సీ,ఎస్టీలకు 100% బీసీ, సన్న, చిన్నకారు రైతులకు 90%, ఇతర రైతులకు 80% రాయితీ ఇవ్వనున్నారు.