
వంటిమామిడి వద్ద పోలీస్‌ల స్పెషల్ డ్రైవ్
ములుగు(గజ్వేల్): నిత్యం వాహనాల రద్దీతో రాకపోకలకు ఆటంకంగా మారిన రాజీవ్ రహదారిపై గల వంటిమామిడి మార్కెట్ యార్డు వద్ద మంగళవారం ములుగు పోలీస్‌లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హైదరాబాద్–కరీంనగర్ వెళ్లే రాజీవ్ రహదారిపై వంటిమామిడి మార్కెట్ యార్డు ఉంటుంది. ప్రతీ నిత్యం తెల్లవారు జాము 4 గంటలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూరగాయల విక్రేతలు, వ్యాపారుల వాహనాలతో సందడిగా ఉంటుంది. దీంతో ఈ రోడ్డుపై కరీంనగర్, సిద్దిపేట వైపు వెళ్లే వాహనాలకు తీవ్ర ఆటంకంగా మారింది. రాజీవ్ రహదారిపై క్రయవిక్రయాల రద్దీని అధిగమించేందుకు యార్డు ఎదుట ఉన్న ఖాళీ ప్రదేశంలో మార్కెట్ నిర్మాణం చేపడుతామని ఇటీవలె ఇక్కడి పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్ మనుచౌదరి పేర్కొన్నారు. తాజాగా గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, ములుగు ఎస్‌ఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీస్‌లు, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ మోహన్, వైస్ చైర్మన్ ప్రభాకర్ డైరెక్టర్ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. రోడ్డుపైన రాకపోకలకు అవరోధంగా నిలిచిన కూరగాయల వాహనాలను మార్కెట్‌యార్డు లోపలికి పంపించారు. దీంతో అక్కడ ట్రాఫిక్ సమస్య పరిష్కారమైంది. వంటిమామిడి మార్కెట్ యార్డు ఎదుట మార్కెట్ యార్డు నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని గజ్వేల్ ఆర్‌డీఓ చంద్రకళ ములుగు తహసీల్దార్ ఆరీపాతో కలసి మంగళవారం పరిశీలించారు.
వాహనాల రద్దీ నియంత్రణకు చర్యలు