రూ.4.57 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి
ముగ్గురు నిందితులు అరెస్టు
కొమురవెల్లి(సిద్దిపేట): రైస్ మిల్లులో ప్రభుత్వ ధాన్యం అవకతవకలు జరిగిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన కొమురవెల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మంగళవారం చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్‌ఐ రాజు కథనం మేరకు.. మండలంలోని కిష్టంపేట శివారులో ఉన్న శ్రీనివాస రైస్‌మిల్‌లో సివిల్ సప్లయ్ మేనేజర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం సీఎంఆర్‌కు అప్పగించిన ధాన్యం మిల్లింగ్‌లో మొత్తం 18,513 క్వింటాళ్ల ధాన్యం అవకతవకలకు గురైందని, దాని విలువ రూ.4,57,93,542 ఉంటుందని పోలీస్ స్టేషన్‌లో సివిల్ సప్లయ్ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి మిల్లు యజమానులైన ఆకుల ప్రతాప్, ఆకుల కృష్ణ, ఆకుల శ్రీనివాస్‌ను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు.
అదుపుతప్పి చెట్టును ఢీకొన్న బైక్ : వ్యక్తి మృతి
కౌడిపల్లి(నర్సాపూర్): బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మహమ్మద్‌నగర్ శివారులోని హనుమాన్‌గుడి సమీపంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి కథనం మేరకు.. రాయిలాపూర్ గ్రామానికి చెందిన కుర్మ కిష్టయ్య(51) భార్య పద్మతో కలిసి బైక్‌పై వెల్దుర్తి మండలం దర్పల్లి గ్రామంలో బంధువుల వద్దకు సోమవారం వెళ్లాడు. మంగళవారం ఒక్కడే తిరిగి వస్తున్నాడు. మహమ్మద్‌నగర్ శివారులోని హనుమాన్ ఆలయం సమీపంలోని అడవిలో బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌తోపాటు అతను పొదల్లో పడిపోయాడు. చాలా సేపటికి పెట్రోలింగ్ పోలీసులు చూడగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి దత్తత కుమారుడు గొరకంటి షాదుల్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అప్పుల బాధతో ఉరేసుకొని ఇద్దరు ఆత్మహత్య
వేలూరు గ్రామంలో వ్యక్తి
వర్గల్(గజ్వేల్): అప్పుల బాధతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వర్గల్ మండలం వేలూరులో మంగళవారం చోటు చేసుకుంది. గౌరారం ప్రొబేషనరీ ఎస్‌ఐ కీర్తి రాజు కథనం మేరకు.. వేలూరుకు చెందిన చింతకింది మహేశ్(36), అనూష దంపతులకు కూతురు వైష్ణవి ఉంది. నాలుగేళ్ల కిందట మహేశ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటికే పరిమితమయ్యాడు. భార్య అనూష కూలీగా పని చేస్తుంది. 14 నెలల కిందట నుంచి గ్రామంలో ఇల్లు కట్టుకుంటున్నారు. తెలిసిన వారి దగ్గర అప్పు చేసినప్పటికీ ఇంటి నిర్మాణం పూర్తికాలేదు. దీంతో మనస్తాపం చెందిన మహేశ్ మంగళవారం ఉదయం భార్య కూలీ పనికి వెళ్లగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు కేసు నమోదు చేశారు.
జహీరాబాద్‌లో నగల వ్యాపారి
జహీరాబాద్: అప్పుల బాధతో నగల వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జహీరాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జహీరాబాద్ పట్టణంలోని మహీంద్ర కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న రవికాంత్(34) బంగారం నగల వ్యాపారం చేసుకుంటున్నాడు. అవసరాల నిమిత్తం అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి పెరగడంతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పట్టణ పోలీసులు పేర్కొన్నాడు.