
ఆయిల్ పామ్ సాగుపై రైతులకు ప్రోత్సాహం
రైతులు వరి, మామిడి, తదితర పంటను సాగు చేసి అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా రసాయన ఎరువులను పిచికారీ చేసి పెట్టుబడుల భారం పెంచుకుంటున్నారు. చివరికి వడగళ్లు, అకాల వర్షాలకు పంట నేలపాలై ఆర్థికంగా నష్టాలను చవిచూస్తున్నారు. ఈ క్రమంలో రైతులు ఎక్కువగా నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగు వైపు ప్రోత్సహిస్తుంది. ఇటీవల గ్రామాల వారీగా ఉద్యానశాఖ, వ్యవసాయశాఖ, లీవింగ్‌పామ్ కంపెనీ అధికారులు రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ ఆయిల్‌పామ్ సాగు ద్వారా వచ్చే దిగుబడి, ఆదాయాలపై వివరిస్తున్నారు.
పెద్దశంకరంపేట(మెదక్)
/హుస్నాబాద్‌రూరల్:
తోటపల్లిలో ఆయిల్ పామ్‌లో అంతర పంటగా మొక్కజొన్న సాగు చేసిన రైతు
నాలుగేళ్లు
అంతర పంటల సాగు
ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు పంట చేతికొచ్చే నాలుగేళ్ల సమయంలో అంతర పంటలను సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు. మొక్కజొన్న, పత్తి, పెసర్లు, మినుములు, బొబ్బర, వేరుశనగ, పొద్దు తిరుగుడు, మునగ మొదలగు పంటలను రైతులు సాగు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆరుతడి పంటలు సాగు చేయడం వల్ల సాగు నీటి కొరతను రైతులు అధిగమించి పంట దిగుబడులు తీయొచ్చు. ఆదాయం పొందవచ్చు.
మెదక్ జిల్లాలో 5 వేల ఎకరాలు లక్ష్యం
జిల్లాలో 5 వేల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు దాదాపు 1,000 ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంటను సాగు చేస్తున్నారు. వివిధ మండలాల్లో మరికొంత మంది రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. దశాబ్దాలుగా వరి సాగు చేస్తున్న పలువురు రైతులు వంట మార్పిడి చేయాలని భావించి ఆయిల్ పామ్ సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 1,000 ఎకరాల వరకు ఆయిల్ పామ్ పంటను సాగు చేశారు. ఇటీవలె పెద్దశంకరంపేట, అల్లాదుర్గం మండలాల్లో రైతులతో అధికారులు ఒప్పందం చేసుకున్నారు.
వరి పంటను తగ్గించి..
హుస్నాబాద్ డివిజన్‌లో అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, హుస్నాబాద్ మండలాల్లో 1,700 ఎకరాల్లో రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. యాసంగి పంటలకు సాగు నీటి కొరతను అధికమించడానికి వరి పంటను తగ్గించి ఆయిల్ పామ్ సాగు చేస్తే లాభాలు పొందవచ్చు. డివిజన్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 1,000 ఎకరాలు, ఉద్యావనశాఖ ఆధ్వర్యంలో 1,500 ఎకరాలు ఆయిల్ పామ్ సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులు పంట దిగుబడులు రాగానే నంగునూర్ మండలంలోని ఆయిల్ పామ్ కంపెనీ వారే రైతుల వద్దకు వచ్చి పంటను కొనుగోలు చేయనున్నారు.
సబ్సిడీపై మొక్కలు, డ్రిప్పు పరికరాలు
ఆయిల్ పామ్ సాగు చేసే ఎస్సీ, ఎస్టీలకు డ్రిప్ సిస్టం కోసం 100 శాతం సబ్సిడీ ఇస్తుంది. బీసీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. మొక్కలకు సబ్సిడీ అందించడంతోపాటు బిందు సేద్యం ద్వారా నీరు అందించడానికి డ్రిప్పు పరికరాలనూ సబ్సిడీపై అందించనుంది. ఆయిల్ పామ్ మొక్కలను 90 శాతం సబ్సిడీ పై రూ.1,140కి రైతు వాటా చెల్లిస్తే ఎకరాకు 57 మొక్కలను ప్రభుత్వం అందిస్తుంది. నాలుగేళ్లు పంటల నిర్వహణ కోసం ఎకరాకు రూ.4,200 ప్రభుత్వం రైతుకు ఇస్తుంది. పెద్ద రైతులు వరి పంటలను తగ్గించి ఆయిల్ పామ్ సాగు చేయాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం
హుస్నాబాద్ డివిజన్‌లోని పెద్ద రైతులు ఎక్కువ వరి సాగు తగ్గించి దీర్ఘకాలిక పంటైన ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలి. నాలుగేళ్లు పంట సాగుకు శ్రమిస్తే 30 ఏళ్లపాటు ప్రతీ ఏటా ఎకరాకు 10 నుంచి 12 టన్నుల దిగుబడులు తీయొచ్చు. ఒక టన్నుకు రూ.20,000 అయినా ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం రైతుకు వస్తుంది. జూలై మొదలు జనవరి వరకు పంట దిగుబడులను తీయొచ్చని హుస్నాబాద్ ఏడీఏ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.
సబ్సిడీపై మొక్కలు,
డ్రిప్ పరికరాలు అందజేత
అవగాహన కల్పిస్తున్న అధికారులు
వినియోగించుకోవాలంటూ సూచనలు
రైతులకు అదనపు ఆదాయం
రైతులు తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలికంగా అధిక ఆదాయాన్ని పొందాలంటే ఆయిల్ పామ్ సాగు అనేది మంచి నిర్ణయం. రైతులు వరి, మొక్క జొన్న, పత్తి పంటల్లో స్వల్పకాలికంగా ఆదాయాన్ని పొందుతున్నప్పటికీ దీర్ఘకాలికంగా రైతు ఆదాయం పెరగాలంటే తప్పనిసరిగా ఆయిల్ పామ్ సాగు చేయాలి. ప్రభుత్వం డ్రిప్ కు మరియు మొక్కలకు అధిక మొత్తంలో రాయితీలను ఇవ్వడం వలన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అధిక విస్తీర్ణంలో ఆయిల్ పామ్ పంట సాగు చేపట్టేందుకు అవకాశం ఉంది.
– సంతోష్, జిల్లా ఉద్యానశాఖ అధికారి
మొక్క రూ.20కే అందిస్తున్నాం
జిల్లాలో ఆయిల్ పామ్ తోటల సాగుకు అనుకూల వాతావరణం ఉంది. ఒక ఎకరాకు 57 మొక్కలు అవసరం ఉంటుంది. ఒక మొక్క పూర్తి ఖర్చు రూ.193 కానీ సబ్సిడీపై రైతులకు కేవలం ఒక మొక్కను రూ.20 అందిస్తున్నాం. అంతేగాక పంట సాగు యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తాం. ఆయిల్ పామ్ సాగు చేసిన నాలుగేళ్ల తర్వాత నుంచి దిగుబడి వస్తుంది. అప్పటి వరకు అంతర వంట సాగు కోసం ఏడాదికి రూ.4,200 అందజేయడం జరుగుతుంది.
– జాన్సన్, లీవింగ్ పామ్ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్

ఆయిల్ పామ్ సాగుపై రైతులకు ప్రోత్సాహం

ఆయిల్ పామ్ సాగుపై రైతులకు ప్రోత్సాహం

ఆయిల్ పామ్ సాగుపై రైతులకు ప్రోత్సాహం