
సాంకేతిక విద్య.. బంగారు భవిత
నేడే పాలిసెట్ ప్రవేశ పరీక్ష ● ఉమ్మడి మెదక్ జిల్లాలో 14 కేంద్రాలు
మూడేళ్లలో కోర్సు పూర్తి ● పారిశ్రామిక రంగాల్లో మెరుగైన ఉపాధి
జహీరాబాద్ శ్రీసంగమేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల
జహీరాబాద్ టౌన్: విద్యార్థుల ఉజ్వల భవితకు సాంకేతిక విద్య తోడ్పనుంది. పదవ తరగతిలో ఉత్తీర్ణులైన తర్వాత ఏం చదవాలి.. ఎలాంటి కోర్సులు తీసుకోవాలి.. ఏ విద్యాసంస్థల్లో చేరాలంటూ విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు మదన పడుతుంటారు. ఇలాంటి వారికి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు ఓ మంచి అవకాశం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలనుకునే వారికి పాలిటెక్నిక్ ఒక వరం లాంటిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలు
సోమవారం (13న) పాలిసెట్(2025–26) పరీక్ష జహీరాబాద్ పట్టణంలోని రెండు కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు జహీరాబాద్ శ్రీ సంగమేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సువర్ణ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలు ఉండగా సంగారెడ్డి జిల్లాలో 7 కేంద్రాలు ఉన్నాయి. జహీరాబాద్‌లో ఆర్‌ఎల్‌ఆర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు పరీక్ష సెంటర్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందన్నారు. విద్యార్థులు 30 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలన్నారు.
నేరుగా బీటెక్‌లోకి ప్రవేశం
మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేశాక.. పరిశ్రమల్లో వెంటనే ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఉన్నత విద్య కావాలంటే కూడా అందుకు అవకాశాలు ఉన్నాయి. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు పూర్తియ్యాక ఈసెట్ రాసి.. నేరుగా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్‌లో చేరవచ్చు. మూడేళ్లలో ఇంజనీరింగ్ పూర్తి అవుతుంది. పాలిటెక్నిక్‌లో కంప్యూటర్స్, ఈసీఈ, ఈఈఈ, సివిల్, మెకానికల్ ఇంజనీర్, లాంటి కోర్సులు ఉంటాయి. ఇంజనీరింగ్‌లో కూడా పాలిటెక్నిక్‌లో చదివే సబ్జెక్టులే ఉంటాయి. పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్ చేస్తే సులువుగా సబ్జెక్ట్‌పై పట్టు వస్తుంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కంటే కూడా పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారికి కంపెనీలు అధిక ప్రాధ్యానం ఇస్తాయి.
ప్రవేశాలు ఇలా..
పదవ తరగతి పాసైన విద్యార్థులు ప్రభుత్వం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాయాలి. రాష్ట్ర సాంకేతిక శిక్షణ సంస్థ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసి ర్యాంక్ ఆధారంగా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చేరిన విద్యార్థులకు డిప్లొమా కోర్సుల్లో సెమిస్టర్ ప్రకారం శిక్షణ ఇస్తారు.