
దుబ్బాక దవాఖాన రాష్ట్రంలోనే టాప్
దుబ్బాక: రాష్ట్రంలోనే ఉత్తమ వైద్య సేవలు అందించడంలో దుబ్బాక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆదర్శంగా నిలిచింది. తాజాగా తెలంగాణ (ఈహెచ్‌ఎంఐఎస్) వైద్య ఆరోగ్య, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ విడుదల చేసిన జాబితాలో ఉత్తమ ఓపీ వైద్య సేవల్లో దుబ్బాక ఆస్పత్రి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏరియా, జిల్లా ఆస్పత్రులు, సీహెచ్‌సీలతోపాటు ఉస్మానియా ఆస్పత్రితోపాటు పెద్దాస్పత్రులను మొత్తం 102 ఆస్పత్రులను పరిగణలోకి తీసుకొని ఈ జాబితాను వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసింది. జనవరి 1న 2025 నుంచి మే8 వరకు గణాంకాలను పరిగణలోకి తీసుకొని రూపొందించారు.
అబా యాప్‌లో రోగుల ఆరోగ్య రికార్డులు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అబా యాప్ (ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ ఖాతా) ద్వారా దుబ్బాక ఆస్పత్రికి వచ్చే రోగుల రికార్డులను పొందుపరుస్తున్నారు. ఆస్పత్రికి వైద్య సేవల కోసం వచ్చే రోగులకు వారి మొబైల్‌లో అబా యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి రోగి ఆరోగ్య వివరాలు పొందు పరుస్తున్నారు. రోగి ఏ ఆస్పత్రికి వెళ్లినా ఈ అబా యాప్‌ను చూపిస్తే వారి ఆరోగ్య పరిస్థితి అంతా తెలిసిపోతుంది. ఇందు కోసం ఆస్పత్రిలో 7 మాడ్యుళ్లను సజావుగా నడుపుతున్నారు. జనవరి 1, 2025 నుంచి మే 8, 2025 వరకు ఓపీడీ 25,593, ఈఓపీ 15,000 రోగులు కలిపి మొత్తం 40,593 మంది రోగులు దుబ్బాక ఆస్పత్రికి వైద్య సేవల కోసం వచ్చినట్లు తెలిపారు. ప్రతి రోజూ ఆస్పత్రిలో 300 ఓపీ ఐతే అబా 150 టోకెన్లు, డాక్టర్ ప్రిస్కిప్షన్ 200 నుంచి 250 అవుతుంది. డాక్టర్ ప్రి స్కిప్షన్ 90 శాతం, అబా 80 శాతంతో రాష్ట్రంలో ఓపీ వైద్యసేవల్లో టాప్‌లో నిలిచింది. గతేడాది రెండో స్థానంలో నిలువగా ఈసారి మొదటి స్థానంలో నిలవడం విశేషం.
ఇటీవలె సందర్శించిన కమిషనర్
మే 3న దుబ్బాక ఆస్పత్రిని రాష్ట్ర వైద్య, విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ సందర్శించి ఆస్పత్రి నిర్వహణ, రోగులకు అందిస్తున్న సేవలపై ప్రత్యేకంగా ప్రశంసించారు. సరైన వైద్య సిబ్బంది లేకున్నా కార్పొరేట్‌కు దీటుగా సేవలు అందిస్తూ రాష్ట్రంలో ఉత్తమ ఆస్పత్రిగా నిలవడం అభినందనీయం అన్నారు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందితోపాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పి స్తామని హామినిచ్చారు. కమిషనర్ వచ్చిన ఐదు రోజులకే ఓపీ వైద్య సేవల్లో టాప్ స్థానంలో నిలువడం విశేషం.
ఓపీ సేవల్లో మొదటి స్థానంలో నిలిచిన ఏరియా ఆస్పత్రి
ఈహెచ్‌ఎంఐఎస్ జాబితా విడుదల
ర్యాంకు ఇచ్చిన వైద్యారోగ్య శాఖ
ఇటీవలె ఆస్పత్రిని సందర్శించిన
రాష్ట్ర వైద్య, విధాన పరిషత్ కమిషనర్
అజయ్‌కుమార్
వైద్య సిబ్బంది సహకారంతోనే..
ఓపీ వైద్య సేవల్లో దుబ్బాక ఏరియా ఆస్పత్రి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలువడం చాలా సంతోషంగా ఉంది. వైద్యులు, సిబ్బంది నిరంతర సహకారంతోనే ఈ ఘనత సాధించాం. ఇంకా మంచి వైద్య సేవలు అందించి ఉత్తమ స్థానంలో నిలుస్తాం. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన తమ వైద్య బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు.
– డాక్టర్ హేమరాజ్‌సింగ్,
దుబ్బాక ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్
మొదటి స్థానం సంతోషకరం
ఉత్తమ వైద్య సేవల్లో దుబ్బాక ఏరియా ఆస్పత్రి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలువడం సంతోషకరం. ఇప్పటికే అరుదైన సర్జరీలు, వైద్య సేవలు అందించడంలో రాష్ట్రంలోనే మంచి పేరు సాధించింది. సరిపడా వైద్యులు, సిబ్బంది, సౌకర్యాలు లేనప్పటికీ ఉన్న సిబ్బందితో నిరంతరం కష్టపడి ఈ ఘనత సాధించడం విశేషం.
– కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే

దుబ్బాక దవాఖాన రాష్ట్రంలోనే టాప్

దుబ్బాక దవాఖాన రాష్ట్రంలోనే టాప్

దుబ్బాక దవాఖాన రాష్ట్రంలోనే టాప్