
పెండ్లికి చేసిన అప్పులతో మనోవేదనకు గురై..
వర్గల్(గజ్వేల్):పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. ఈ ఘటన వర్గల్ మండలం గిర్మాపూర్‌లో చోటు చేసుకుంది. గౌరారం ప్రొబేషనరీ ఎస్‌ఐ కీర్తి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గిర్మాపూర్‌కు చెందిన సాయిల్ల అశోక్, సుశీల(44) దంపతులకు సబిత, కల్పన, కార్తీక్ ముగ్గురు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల కిందట పెద్ద కూతురు వివాహం కోసం కొంత అప్పు చేశారు. ఆ అప్పు విషయంలో సుశీల తరచూ బాధ పడేది. ఆదివారం ఉదయం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన ఆమె గుర్తు తెలియని పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రికి తరలించగా అదే రోజు రాత్రి మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పురుగు మందు తాగిన మహిళ
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి