డీల్ కాదు.. జేబు ఖాళీ! | e-commerce companies using dark patterns | Sakshi
Sakshi News home page

డీల్ కాదు.. జేబు ఖాళీ!

Jun 3 2025 5:14 AM | Updated on Jun 3 2025 5:23 AM

e-commerce companies using dark patterns

ఈ–కామర్స్‌ కంపెనీల మాయాజాలం

‘డార్క్‌ ప్యాటర్న్స్‌’తో గాలం

అవసరం లేకపోయినా కొనిపించేలా ఎత్తులు

రంగంలోకి కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ

ఒక వస్తువు కావాల్సి వచ్చి ఆన్స్ లైన్స్ లో వెతికేటప్పుడు.. ఆ ఉత్పాదన తాలూకు పేజీలో ‘ఒకటి మాత్రమే ఉంది’, ‘10 నిమిషాల్లో కొంటే భారీ డిస్కౌంట్‌’, ‘ఫ్లాష్‌ డీల్‌ ఈ రోజు వరకే’ వంటి సందేశాలు దర్శనమిస్తాయి. అవి నిజమనుకుని నమ్మి కస్టమర్లు వెంటనే కొనేస్తారు. అమ్మకాలను పెంచుకోవడమే లక్ష్యంగా చేసే ఈ మాయాజాలాన్ని ‘డార్క్‌ ప్యాటర్న్స్‌’ అని పిలుస్తారు. ఈ–కామర్స్‌ కంపెనీలు పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఆర్భాటంగా నిర్వహించే ‘ఆన్స్ లైన్స్  సేల్స్‌’ సమయంలో ఈ మాయాజాలం విభిన్న రూపాల్లో ‘స్క్రీన్స్ ’పైన దర్శనమిస్తుంది.

ఓ సర్వే ప్రకారం కొనాలన్న ఆలోచన లేనప్పటికీ డార్క్‌ ప్యాటర్న్స్‌ కారణంగా ఆకర్షితులై 40% కంటే ఎక్కువ మంది వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేస్తున్నారట. షాపింగ్‌ వెబ్‌సైట్ల తప్పుదారి పట్టించే, మోసపూరిత, చట్టవిరుద్ధ వ్యూహాలే ఇందుకు ప్రధాన కారణం. ఈ–కామర్స్, క్విక్‌ కామర్స్‌ కంపెనీలు వివిధ రకాల డార్క్‌ ప్యాటర్న్స్‌తో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. తీరా చూస్తే తాము ఎక్కువ ఖర్చు చేశామనో.. లేదా అంతగా ఉపయోగకరం కాని ఉత్పత్తులను కొన్నామనో వినియోగదారులు తరువాత తెలుసుకుంటున్నారు. ఆన్స్ లైన్‌ కస్టమర్లు తమకు కావాల్సిన వస్తు, సేవలను వేగంగా, సౌకర్యంగా పొందడం కోసం తరచూ డబ్బు, సమాచారం, గోప్యతతో రాజీ పడుతున్నారనేది నగ్న సత్యం.

ఒకటికి రెండుసార్లు..
ఏ వెబ్‌సైట్‌ ఉపయోగిస్తున్నా, సర్వీస్‌ ప్రొవైడర్‌ను ఎంతగా విశ్వసించినా మీ నుండి ఏ సమాచారం అడుగుతున్నారు, ఎటువంటి అనుమతులు కోరుతున్నారు అనే అంశాలపై వినియోగదార్లు అప్రమత్తంగా ఉండాలి. స్క్రీన్స్ పై ఉన్న సమాచారాన్ని జాగ్రత్తగా చదవాలి. ‘బై’ బటన్స్  క్లిక్‌ చేసే ముందు మీకు కావాల్సింది మాత్రమే అక్కడ ఉందో లేదో ఒకటికి రెండుసార్లు గమనించాలి. ఆన్స్ లైన్‌ సేవల కోసం సైన్‌ అప్‌ చేసే ముందు అన్ని సమయాల్లో రద్దు చేసుకునేందుకు స్పష్టమైన, కచ్చిత అవకాశం ఉందా లేదా నిర్ధారించుకోవాలి. 

కనీసం ఒకటి..
అడ్వర్టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా–2024 నివేదిక ప్రకారం.. అత్యధికంగా డౌన్స్ లోడ్‌ అయిన టాప్‌–53 భారతీయ యాప్స్‌లో ఒకటి మినహా మిగిలినవన్నీ కనీసం ఒక డార్క్‌ ప్యాటర్న్‌ ఉపయోగించాయట. లోకల్‌ సర్కిల్స్‌ నిర్వహించిన సర్వే ప్రకారం దాదాపు 50% భారతీయ వినియోగదారులు ఆన్స్ లైన్‌ చెల్లింపుల సమయంలో కనీసం ఒక డార్క్‌ ప్యాటర్న్‌ సమస్యను ఎదుర్కొన్నారట.

రంగంలోకి కేంద్ర ప్రభుత్వం
ఈ–కామర్స్‌ సంస్థలు అనుసరిస్తున్న ఈ మోసపూరిత విధానాల పట్ల వినియోగదారులు, ఆఫ్‌లైన్స్  ట్రేడర్ల నుంచి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఉత్పత్తులు పరిమితంగా ఉన్నాయని బుకాయించడం, పేమెంట్‌ చేసే సమయానికి అదనపు చార్జీ, నకిలీ కౌంట్‌డౌన్స్  టైమర్స్, ఒక వస్తువు చూపించి మరొకటి అంటగట్టడం, లావాదేవీ రద్దు చేసే అవకాశం లేకపోవడం, యూజర్‌ కోరకున్నా ప్రకటనల వీడియో ప్లే కావడం, తప్పుడు రివ్యూలు, పోల్చుకునే అవకాశం లేకపోవడం వంటి 13 రకాల డార్క్‌ ప్యాటర్న్స్‌ను గుర్తించింది.

నిబంధనలను పాటించకపోతే చట్ట పరంగా చర్యలు ఉంటాయని ఈ–కామర్స్‌ కంపెనీలను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. వినియోగదారుల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే, అనాలోచిత కొనుగోళ్లు, చర్యలకు దారితీసే తప్పుదారి పట్టించే డార్క్‌ ప్యాటర్న్స్‌ను తొలగించడానికి చేసిన మార్పులను వివరిస్తూ అంతర్గత వార్షిక తనిఖీ నివేదికలను మంత్రిత్వ శాఖకు సమర్పించాలని కంపెనీలకు స్పష్టం చేసింది. 

విదేశాల్లో చట్టాలు
భారత్‌లో ఇప్పటివరకు ఈ పద్ధతిని నిషేధించే నిర్దిష్ట చట్టాలు లేవు. వినియోగదారుల రక్షణ చట్టం–2019 ప్రకారం అన్యాయమైన వాణిజ్య పద్ధతులుగా గుర్తిస్తూ డార్క్‌  ప్యాటర్న్స్‌ను అరికట్టడానికి కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (సీసీపీఏ) 2023 నవంబర్‌లో మార్గదర్శకాలను జారీ చేసింది. అమెరికా, ఈయూ తదితర దేశాల్లో దీనికి సంబంధించి చట్టాలు అమలులోనూ ఉన్నాయి. వినియోగదారులు కుకీజ్‌ను అంగీకరించడం కంటే తిరస్కరించడం కష్టతరం చేసినందుకు గూగుల్, ఫేస్‌బుక్‌ రెండింటికీ ఈయూ, ఫ్రెంచ్‌ డేటా రక్షణ చట్టాల ప్రకారం 2022లో జరిమానా విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement