వడివడిగా పనుల్
‘గ్లోబల్’..
వంద ఎకరాల్లో ‘సమ్మిట్’కు ఏర్పాట్లు
సమ్మిట్‌కు చేస్తున్న ఏర్పాట్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ పరిసరాలను ప్రభుత్వం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తోంది. సమ్మిట్ సమయం సమీపిస్తుండటంతో ఏర్పాట్ల టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ వెయ్యి మంది కూలీలతో రాత్రి పగలు తేడా లేకుండా పని చేయిస్తోంది. ఇప్పటికే హెచ్‌ఎండీఏ ఎంపిక చేసిన భూమిలోని ఎత్తు పల్లాలను జేసీబీలతో చదును చేయిస్తూ.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి శ్రీశైలం జాతీయ రహదారి మీదుగా సమ్మిట్ నిర్వహించే ప్రదేశానికి వచ్చే పోయే మార్గాలకు ఇరు వైపులా 1.50 లక్షల ఎత్తైన పూల మొక్కలను నాటే పనులు చేపట్టింది. ఇరుకుగా ఉన్న రోడ్లను మట్టి, కంకర, తారుతో విస్తరిస్తున్నారు. ఎంపిక చేసిన వంద ఎకరాల ప్రాంగణాన్ని 32 విభాగాలుగా విభజించారు. ప్రధాన హాలు చుట్టూ వృత్తాకార డిజైన్‌లో వేదిక ఏర్పాటు చేశారు. సమ్మిట్ ప్రారంభ వేదికలో 2,500 మంది కూర్చునేలా సీటింగ్ కెపాసిటీ ఏర్పాటు చేస్తున్నారు. వేదికకు ఇరువైపులా మరో ఆరు హాల్స్ సిద్ధం చేస్తున్నారు. ఇవి పూర్తిగా వృత్తాకారంలోనే ఉండనున్నాయి. ఎగ్జిబిషన్, ఇష్టాగోష్టి, పరస్పర ఒప్పందాలు వీటి కిందే జరగనున్నాయి. వివిధ విభాగాలకు చెందిన 45 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందినవి సైతం ఉంటాయి. 1,300 ప్రముఖ సంస్థల నుంచి 2,600 మంది పెట్టుబడిదారులు రానుండటంతో ఈ ప్రాంతాన్ని పర్యావరణహితంగా, ప్లాస్టిక్ రహితంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారు. మూడో తేదీ లోగా ఏర్పాట్లు పూర్తి చేసి, నాలుగు, ఐదు తేదీల్లో డ్రై రన్ నిర్వహించేందుకు సమయాత్తమవుతున్నారు.
32 విభాగాల్లో వేయి మంది కూలీలతో పనులు
కిలోమీటరు దూరంలో మూడు హెలీపాడ్‌లు.. ఆరు బస్సులు
వృత్తాకారంలో వేదిక.. ఇరువైపులా ఆరు హాల్స్
రాకపోకలకు వెయ్యి ప్రత్యేక బస్సులు
2,500 మంది పోలీసులతో బందో‘మస్తు’
వివిధ దేశాల నుంచి వచ్చే ప్రముఖులను రిసీవ్ చేసుకునేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు మూడు హెలీకాఫ్టర్లు సహా మూడు హెలీపాడ్‌లను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రధాన వేదికకు కిలోమీటర్ దూరం ఉంది. ఆరు బస్సులను రెడీ చేస్తున్నారు.
దేశవిదేశీ ప్రతినిధుల బస కోసం శంషాబాద్ సహా నగరంలోని వివిధ ప్రముఖ హోటళ్లలో వెయ్యికిపైగా గదులను బుక్ చేశారు. వీరి రాక పోకల కోసం వెయ్యి బస్సులను అందుబాటులో ఉంచనున్నారు.
పెట్టుబడిదారులతో పాటు ప్రధాని సహా పలువురు ప్రముఖులు హాజరుకానుండటంతో 2,500 మందితో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. కేవలం సమ్మిట్ నిర్వాహకులు జారీ చేసిన పాసులు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించనున్నారు.
మెరుగైన కమ్యూనికేషన్ కోసం టీ–ఫైబర్ ఆధ్వర్యంలో 10 గిగా బైట్స్ ఫర్ సెకండ్(జీబీపీఎస్) వేగంతో వైఫై సౌకర్యం కల్పించనున్నారు. ప్రాంగణంలోకి అనుమతి ఉన్న వారికే పాస్‌వర్డ్ ఇవ్వనున్నారు. సెల్ టవర్స్ ఆన్ వీల్స్ విధానంలో బీఎస్‌ఎన్‌ఎల్, వొడాఫోన్, ఎయిర్‌టెల్, జియో తదితర నెట్‌వర్క్ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు.
అతిథుల వాహనాల పార్కింగ్‌కు ఆరు స్థలాలను కేటాయించారు. సదస్సు సమీపానికి ముఖ్యమంత్రి, మంత్రుల కాన్వాయ్‌లను మాత్రమే అనుమతించనున్నారు. మిగిలిన వాహనాలు అర కిలోమీటర్ దూరంలోని అమెజాన్ డేటా సెంటర్ సమీపంలో నిలపాల్సి ఉంది. అక్కడి నుంచి వారిని ప్రత్యేక విద్యుత్ వాహనాల్లో సమ్మిట్ నిర్వహించే ప్రదేశానికి తరలించనున్నారు.
నిరంతర విద్యుత్ సరఫరాకు ఇప్పటికే మూడు 160 కేవీఏ అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. మూడు కిలోమీటర్ల మేర ఉన్న ఓవర్ హెడ్ లైన్లను తొలగించి, దాని స్థానంలో యూజీ కేబుల్ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా భూ బాధితులకు ఇచ్చిన ప్లాట్లలోనూ ఓహెచ్ లైన్లను తొలగించి, యూజీ కేబుల్స్ వేయనున్నారు.
పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతను స్థానిక తుక్కుగూడ మున్సిపాలిటీకి అప్పగించగా, తాగునీటి సరఫరా బాధ్యతను జల మండలికి అప్పగించింది. ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయనున్నారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం ప్రాంగణం చుట్టూ జనరేటర్లను సైతం సిద్ధం చేశారు.
అతిథులకు టీ, కాఫీ, టిఫిన్, స్నాక్స్, లంచ్, డిన్నర్ సప్లయ్ బాధ్యతను నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌కు అప్పగించారు. భోజనం కోసం మూడు హాల్స్ సిద్ధం చేశారు. వీటిలో ఒకటి వీవీఐపీలకు, రెండు అతిథులకు కేటాయించారు. పోలీసులు, మీడియా కోసం ఎంట్రన్స్ వద్దే ప్రత్యేక హాల్స్ సిద్ధం చేస్తున్నారు. ప్రాంగణాన్ని సుందరంగా తీర్చి దిద్దే బాధ్యతను హెచ్‌ఎండీఏకు అప్పగించారు.
వడివడిగా పనుల్


