కుల ధ్రువీకరణ పత్రాల కోసం నిరీక్షణ
కొందుర్గు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాల కోసం అనేక అవస్థలు పడుతున్నారు. శుక్రవారం పత్రాల కోసం దరఖాస్తు చేయడానికి మీ సేవల్లో క్యూ కడుతున్నారు. కాగా మీ సేవల్లో సర్వర్ పనిచేయకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ అజాం అలీని వివరణ కోరగా సర్వర్ పనిచేయకపోవడమనే సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉందన్నారు. రాత్రివేళల్లో పనిచేయవచ్చని తెలిపారు. ఇంకా ఒకరోజు సమయం ఉందని, ఒకవేళ పనిచేయకపోతే మాన్యువల్ సర్టిఫికెట్ ఇస్తామని పేర్కొన్నారు.
ట్రావెల్స్ బస్సు, కారు ఢీ
శంకర్‌పల్లి: అతివేగం, అజాగ్రత్తగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టిన సంఘటన గురువారం అర్ధరాత్రి శంకర్‌పల్లి మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం లింగంపల్లి గ్రామంలో విందుకు హాజరైన 40 మందితో కూడిన ఓ కుటుంబం అర్ధరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సంగారెడ్డి జిల్లా రామచంద్రపురానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో బస్సు మండలంలోని మహాలింగాపురం వద్దకు రాగానే ఎదురుగా కారులో అజాగ్రత్తగా వస్తున్న నాగసేనారెడ్డి బలంగా ఢీ కొట్టాడు. ఈ ఘటనలో కారు డ్రైవర్‌కి పాక్షిక గాయాలు కాగా.. బస్సు ముందు భాగం దెబ్బతింది. బస్సులోని ప్రయాణికులు క్షేమంగా ఉండడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


