నిఘా నీడన..
షాద్‌నగర్: పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంలో కోడ్ అమల్లోకి వచ్చింది. ఉల్లంఘనలకు పాల్పడకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎన్నికల సంఘం అధికారులు షాద్‌నగర్‌లో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. ఫ్లయిండ్ స్క్వాడ్ (ఎఫ్‌ఎస్‌టీ), స్టాటిక్ సర్వైలైన్స్ (ఎస్‌ఎస్‌టీ) బృందాలను నియమించారు. ఈ బృందాలు అక్రమ మద్యం, నగదు రవాణా ఓటర్లకు మద్యం, నగదు పంపిణీ వంటివాటిని అడ్డుకోవడంతో పాటు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నాయి.
ఎఫ్‌ఎస్‌టీ ఏం చేస్తారంటే..
షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ, ఫరూఖ్‌నగర్ మండలాలకు గాను మండలానికి ఒకటి చొప్పున ఎఫ్‌ఎస్‌టీ బృందాలను కేటాయించారు. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులు ఉన్నారు. వీరు గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోడ్ ఉల్లంఘనలు, నియమావళి సరిగా అమలు చేయక పోవడం వంటి ఫిర్యాదులపై స్పందించి చర్యలు చేపడుతున్నారు.
ఎస్‌ఎస్‌టీ బృందం తనిఖీలు
ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై నిఘా కోసం స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను నియమించారు. ఈ బృందాల్లో ఒక డిప్యూటీ తహసీల్దార్, నలుగురు పోలీసులు, ఒక వీడియోగ్రాఫర్ ఉన్నారు. వీరు వాహనాల రాకపోకలపై నిరంతరం నిఘా పెట్టారు.
రసీదులు చూపించాల్సిందే..
ఎన్నికల సంఘం నిర్ణయించిన నగదు కంటే ఎక్కువ తీసుకెళ్తే స్వాధీనం చేసుకుంటారు. రూ.10 వేల విలువైన ఒకే రకమైన వస్తువులు రవాణా చేస్తే ఆయా బృందాలకు వివరణ ఇవ్వాలి. నగదు రసీదులు చూపించాల్సి ఉంటుంది. గంపగుత్తగా చీరలు, మద్యం వంటివి తీసుకెళ్లినా ఆధారాలు చూపించాలి. రూ.50 వేల కంటే అధికంగా నగదు ఉంటే రసీదులు చూపాలి. సరైన ఆధారాలు చూపకుంటే వస్తువులు, నగదు స్వాధీనం చేసుకుంటారు.
టోల్ ప్లాజా వద్ద తనిఖీ కేంద్రం
షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ శివారులో జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా వద్ద ఎన్నికల సంఘం అధికారులు తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎస్‌ఎస్‌టీ బృందం అధికారులు ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలను 24 గంటల పాటు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వాహనాల తనిఖీ ప్రక్రియను మొత్తం వీడియో చిత్రీకరిస్తున్నారు. టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని శుక్రవారం షాద్‌నగర్ ఆర్డీఓ సరిత, తహసీల్దార్ పార్థసారధి పరిశీలించారు.
పంచాయతీ ఎన్నికలపై ఫోకస్
రంగంలోకి ప్రత్యేక బృందాలు
షాద్‌నగర్ టోల్‌ప్లాజా వద్ద తనిఖీ కేంద్రం
వాహనాల్లో పోలీసుల విస్తృత సోదాలు
నిఘా నీడన..


