స్వీయ లబ్ధి కోసమే విలీన ప్రక్రియ
తుర్కయంజాల్: బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా ఫర్ సేల్ అన్నట్లు వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విమర్శించారు. తుర్కయంజాల్‌లోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్స్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అభివృద్ధి కోసం గతంలో అనేక అంతర్జాతీయ కంపెనీలను తీసుకువచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు అంతర్జాతీయ ఖ్యాతిని సాధించేలా చేస్తే నేడు ఫోర్త్ సిటీ పేరుతో భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లకు ప్రోత్సహించి స్వీయ లబ్ధి కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. దేశంలోనే అత్యధిక జీడీపీ కలిగిన జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పడిందన్నారు. శివారు ప్రాంతాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం ద్వారా ప్రజలపై పన్నుల భారం పడనుందని, ఇంటి నిర్మాణ అనుమతులకు అధికంగా వెచ్చించాల్సి వస్తుందన్నారు. జిల్లా అస్తి త్వాన్ని దెబ్బతీసేలా సీఎం సొంత నిర్ణయాన్ని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విలీనం పూర్తిగా అనైతికమని, దీనికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. జిల్లా ఉనికి, హక్కులను కాపాడటానికి ఎంతవరకై నా సిద్ధమేనని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ ఏనుగు ఆనంద్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కొండ్రు మల్లేష్, నాయకులు బొక్క గౌతమ్ రెడ్డి, చెరుకు రఘునాథ్‌గౌడ్, కొండ్రు శ్రీనివాస్, జక్క రాంరెడ్డి, మర్రి సంపతీశ్వర్ రెడ్డి, కళ్లెం ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జీహెచ్‌ఎంసీలో మున్సిపాలిటీల విలీనం అనైతికం
నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే పోరాటం తప్పదు
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి


