గరుడ భవన్ నిర్మాణానికి రూ.2 కోట్ల విరాళం
బంజారాహిల్స్: హరేకృష్ణ మూవ్‌మెంట్–హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతిష్టాత్మక హరేకృష్ణ హెరిటేజ్ టవర్ ప్రాజెక్టుకు అరబిందో ఫార్మా లిమిటెడ్ దాతృత్వ సంస్థ అరబిందో ఫార్మా ఫౌండేషన్ నుంచి కీలకమైన ఆర్థిక సహాయం లభించింది. ఈ మేరకు భారతీయ సంస్కృతి, కళలు, వారసత్వాన్ని ప్రోత్సహించే గరుడ భవన్ నిర్మాణం కోసం రూ.2 కోట్లు విరాళంగా అందజేశారు. అరబిందో ఫార్మా లిమిటెడ్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర, అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్ నిత్యానందరెడ్డి చెక్కును హరేకృష్ణ హెరిటేజ్ టవర్ వైస్ ప్రెసిడెంట్ కౌంతేయ దాస ప్రభూజీకి అందజేశారు. ఈ సందర్భంగా అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్లు నిత్యానందరెడ్డి, శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ..భారతీయ సాంస్కృతిక విలువలను పరిరక్షించేందుకు, సమగ్ర సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఇది అరబిందో ఫార్మా వైఖరిని ప్రతిబింబించే విరాళమన్నారు. హరేకృష్ణ హెరిటేజ్ టవర్ నిర్మాణం భారతీయ కళా సంపదను, ఆధ్యాత్మికతను, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే మహోన్నత ప్రయత్నమని అభినందించారు. ఈ సందర్భంగా హరేకృష్ణ మూవ్‌మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస ప్రభూజీ అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఔదార్యతనంతో కూడిన ఆర్థిక సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.


