వడివడిగా విలీనం..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో శివార్లలోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. మున్సిపాలిటీల విలీనంతో ఆయా స్థానిక సంస్థల్లో రికార్డులు, ఆస్తుల స్వాధీనంపై పురపాలకశాఖ కసరత్తు మొదలు పెట్టింది. ఉద్యోగుల సంఖ్య లెక్క తేల్చే పనిలో నిమగ్నమైంది. రాష్ట్ర మంత్రి మండలి ఇటీవల నగర/పురపాలక సంఘాలను జీహెచ్‌ఎంసీలో కలుపుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా ప్రభుత్వం కూడా మార్గదర్శకాలను జారీ చేస్తోంది. ఆ లోపే ఆయా మున్సిపాలిటీ వివరాల సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీతో ప్రస్తుత బల్దియా పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. ఆ తర్వాత విలీన ప్రాంతాలపై పురపాలక శాఖ మరింత పట్టు బిగించనుంది. అప్పటిలోపు రికార్డులు, ఆస్తులు, ఆదాయ వనరులు, పద్దుల వివరాల లెక్క తీయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు పురపాలక శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
తీన్‌మార్!
ఔటర్ రింగ్‌రోడ్డు పరిధి వరకు ఉన్న మున్సిపాలిటీల విలీనంతో జీహెచ్‌ఎంసీ మెగా కార్పొరేషన్‌గా అవతరించింది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌ను రెండు లేదా మూడుగా విభజించాలనే ప్రతతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌ను ఎన్ని ముక్కలుగా విభజించాలనే అంశంపై త్వరలోనే స్పష్టత రానుంది. అయితే, కార్పొరేషన్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని వార్డుల పునర్విభజన, సర్కిళ్ల ఏర్పాటుపై ముందడుగు వేయాలని పురపాలక శాఖ యోచిస్తోంది. సంస్థాగత పునర్విభజన కార్పొరేషన్ల సంఖ్యను బట్టి ఉన్నందున.. ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా వీటిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. రెండు లేదా మూడు కార్పొరేషన్ల సరిహద్దులను బట్టి ఏ కార్పొరేషన్‌లో ఏ మున్సిపాలిటీలు చేరతాయానేది స్పష్టం కానుంది. విలీనమైన యూఎల్‌బీలు ప్రస్తుతం స్పెషలాఫీసర్ల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఇవి జీహెచ్‌ఎంసీలో కలవడంతో వీరి సేవల నుంచి ఉపసంహరించుకోనున్నారు.
ప్రజాభిప్రాయం అవసరమా ?
గతంలో గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిన వెంటనే వాటిని మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో విలీనం చేయడం తెలిసిందే. ఇప్పుడు వాటిని జీహెచ్‌ఎంసీలో విలీనం చేయనున్నారు. వీటికి ప్రజాభిప్రాయ సేకరణ అవసరమని కొన్ని వర్గాలు చెబుతుండగా, గ్రామపంచాయతీలను యూఎల్‌బీల్లో విలీనం చేసినప్పుడే ఆ ప్రక్రియ కూడా మమ అనిపించారని కొందరు చెబుతున్నారు.
రైతులకు ఇబ్బంది కలిగించొద్దు
ఆదాయ వనరులు, రికార్డుల సేకరణపై కసరత్తు
ఉద్యోగులు, సిబ్బంది లెక్కలు తేల్చే పనిలో పురపాలకశాఖ
కార్పొరేషన్ల సంఖ్యను బట్టి వార్డులు, సర్కిళ్ల పునర్విభజన
విలీన మున్సిపాలిటీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనకు తెర
అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి
వడివడిగా విలీనం..


