నగర విస్తరణ.. నేతల అచేతన!
హైదరాబాద్ మహా నగర ఖ్యాతిని విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు ఆనుకొని ఉన్న పురపాలక సంఘాలను జీహెచ్‌ఎంసీలోకి విలీనం చేసింది. నగర పౌరులుగా మారామన్న ఆనందం ఓవైపు అయితే, పన్నుల భారంతో అవస్థలు పడతామని ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు స్థానిక నాయకులు రాజకీయ నిరుద్యోగులుగా మారుతామని నిరాశలో కూరుకుపోతున్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపాలిటీ ఒకప్పుడు కుగ్రామం. కనీసం ఆ ఊరికి బస్సు సౌకర్యం కూడా ఉండేది కాదు. ప్రస్తుతం ఆదిబట్ల అంటే హైదరాబాద్ అభివృద్ధికి నిదర్శనం. మినీ గచ్చిబౌలిగా పేరు గాంచింది. ఐటీ సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగాలకు నిలయంగా ఉంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమా అంటూ ఆదిబట్లకు ప్రాధాన్యం పెరిగింది. ఆయన హయాంలోనే ప్రతిష్టాత్మకమైన టాటా సంస్థను ఇక్కడికి తీసుకురావడంతో అభివృద్ధి పరుగులు పెట్టింది. అప్పటి ఆదిత్యనగర్ కాస్త కాలక్రమంలో ఆదిబట్లగా పేరు ప్రఖ్యాతలు పొందింది.
2018లో మున్సిపాలిటీగా ఏర్పాటు
ఆదిత్యనగర్ కాస్త స్థానిక నేతల చొరవతో ప్రత్యేక గెజిట్ తీసుకొచ్చి ఆదిబట్లగా పేరు మార్చారు. 2018లో రాష్ట్ర ప్రభుత్వం ఆదిబట్లను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. అప్పటి వరకు ఇబ్రహీంపట్నం మండలంలో భాగమైన ఆదిబట్ల పురపాలక సంఘంగా రూపాంతరం చెందింది. రాందాస్‌పల్లి, బొంగ్లూర్, కొంగరకలాన్, మంగళ్‌పల్లి, ఎంపీపటేల్‌గూడ, ఆదిబట్లలను కలుపుతూ 15 వార్డులుగా విభజించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 15,453 మంది జనాభా ఉంది. ప్రస్తుతం 20 వేలు దాటింది. 2020 జనవరి నెలలో పురపాలక సంఘానికి ఎన్నికలు నిర్వహించారు. మొదట చైర్‌పర్సన్‌గా కొత్త ఆర్తిక, వైస్ చైర్‌పర్సన్‌గా కోరె కళమ్మ పని చేశారు. తదనంతరం 2024 ఏప్రిల్ 6న జరిగిన ఉప ఎన్నికల్లో చైర్మన్‌గా మర్రి నిరంజన్‌రెడ్డి, వైస్ చైర్మన్ కమాండ్ల యాదగిరి ఎన్నికయ్యారు.
ఇక రాజకీయ నిరుద్యోగమే
ఔటర్ రింగ్ రోడ్డుకు అనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో వీలినం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆదిబట్లలో నాయకులు రాజకీయ నిరుద్యోగులుగా మారనున్నారు. మహా నగరంలో కలిస్తే కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకే అవకాశం ఉంటుంది. అది కూడా ఎక్కువ ఓటర్లకు కలిపి ఒక వార్డును ఏర్పాటు చేస్తారు. దీంతో రాజకీయ ఆశావహులకు భంగపాటు తప్పదు. ఇప్పటివరకు ఆదిబట్ల నుంచే అత్యధికంగా పని చేసిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇబ్రహీంపట్నం మండలానికి ఎంపీపీలు, జెడ్పీటీసీలుగా పాశం లక్ష్మీపతిగౌడ్, మర్రి నిరంజన్‌రెడ్డి, భూపతిగళ్ల మహిపాల్, డొంకని పద్మ, పొట్టి అయిలయ్య పని చేశారు. 15 వార్డుల నుంచి అన్ని రాజకీయ పార్టీలకు ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉండేది. కానీ జీహెచ్‌ఎంసీలో వీలినం కావడంతో ఇబ్బందులు తప్పదు.
జీహెచ్‌ఎంసీలో ఔటర్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనం
స్థానికంగా పెరగనున్న రాజకీయ నిరుద్యోగులు
పూర్తిగా అభివృద్ధి కాకముందే కలపడంపై మిశ్రమ స్పందన
పన్నుల భారం మోపొద్దని ప్రజల విజ్ఞప్తులు
మరింత అభివృద్ధి
ఆదిబట్ల మున్సిపాలిటీ అస్తిత్వం దెబ్బతీయకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. తగిన ప్రాధాన్యం ఇచ్చే విధంగా కృషి చేస్తాం. జీహెచ్‌ఎంసీలో విలీనంతో మరింత అభివృద్ధి చెందుతుంది. కొంత పన్నుల రూపంలో ప్రజలపై భారం పడుతుంది.
– నిరంజన్‌రెడ్డి, మాజీ చైర్మన్, ఆదిబట్ల
ప్రజలపై భారం వేయొద్దు
ప్రజలపై భారం వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇంటి అద్దెలు, నల్లా బిల్లు లు, వివిధ రకాల పెంచితే సహించేది లేదు. పూర్తిగా అభివృద్ధి కాకముందే విలీనం చేయడం తగదు. ఇంకో దఫా మున్సిపాలిటీ ఉంటేనే బాగుండేది.
– జంగయ్య, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ఆదిబట్ల
నగర విస్తరణ.. నేతల అచేతన!
నగర విస్తరణ.. నేతల అచేతన!


