అత్యాచార నిందితుల అరెస్ట్
● వివరాలు వెల్లడించిన
కొత్తూరు సీఐ నర్సయ్య
● కల్లు దుకాణాలు, లేబర్ అడ్డాల వద్ద
జాగ్రత్తగా ఉండాలని మహిళలకు సూచన
కొత్తూరు: ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తూరు సీఐ నర్సయ్య తెలిపిన ప్రకారం.. కర్నూల్ జిల్లా బ్రహ్మణ్‌కూట్కూర్ మండలం బొల్లారంలో నివాసం ఉంటున్న నల్లబోతుల సలేశ్వరం(47) (నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల స్వగ్రామం), కర్నూల్ జిల్లా నంద్యాల పట్టణంలోని లక్ష్మీపల్లికి చెందిన ఎరుకలి లోకేష్ బంధువులు. వీరు ఈనెల 22న షాద్‌నగర్ సమీపంలోని బూర్గుల లేబర్ అడ్డా వద్ద పనికోసం వేచిఉన్న ఓ మహిళతో మాటలు కలిపారు. అనంతరం ఆమెను బైకుపై మున్సిపల్ పరిధిలోని కుమ్మరిగూడ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు బుధవారం కొత్తూరులో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైకుపై అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అక్కివానిగూడ వద్ద మహిళపై అత్యాచారం చేసి, ఆభరణాలు ఎత్తుకెళ్లిన విషయాన్ని అంగీకరించారు. సలేశ్వరంపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని సీఐ తెలిపారు. కల్లు దుకాణాలు, లేబర్ అడ్డాల వద్ద కొత్తగా పరిచమయ్యే వ్యక్తుల పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని సీఐ సూచించారు. కేసును ఛేదించిన సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు సత్యశీలరెడ్డి, గోపాలకృష్ణ, కానిస్టేబుళ్లు, తదితరులు పాల్గొన్నారు.


