జేసీబీని ఢీకొట్టిన పెళ్లి కారు
● బెలూన్లు ఓపెన్ కావడంతో నూతన వధూవరులకు తప్పిన ప్రమాదం
● నలుగురికి స్వల్పగాయాలు
చేవెళ్ల: నూతన వధూవరులతో వెళ్తున్న పెళ్లి కారు రోడ్డుపై ఆగి ఉన్న జేసీబీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నూతన దంపతులతో పాటు మరో ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన చేవెళ్ల ఠాణా పరిధిలోని దేవునిఎర్రల్లి స్టేజీ వద్ద బుధవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని రావుపల్లికి చెందిన జ్యోతి, వెంకటేశ్‌ల కూతురు అనూష(లక్ష్మీప్రియ)కు మొయినాబాద్ మండలపరిధిలోని నాగిరెడ్డిగూడకు చెందిన శివకుమార్‌తో చేవెళ్లలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఉదయం వివాహమైంది. సాయంత్రం 6.30 గంటలకు వధువు ఇంటికి కారులో బయలుదేరారు. మార్గమధ్యలోని దేవునిఎర్రవల్లి బస్‌స్టేజీ వద్ద ఓ బొలెరో వాహనం పాడవడంతో దాన్ని బాగు చేసేందుకు జేసీబీని తీసుకువచ్చి పెట్టారు. చీకట్లో వాహనాలు కనిపించకపోవడంతో పెళ్లి కారు వేగంగా జేసీబీని వేగంగా ఢీకొట్టింది. కారులో బెలూన్లు ఓపెన్ కావడంతో స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను చేవెళ్లలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహనాలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


