జీవనాధారాన్ని లాక్కోవద్దు
షాబాద్: జీవనాధారమైన భూములను గుంజుకుంటే ఎలా బతకాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బుధవారం మండలంలోని రేగడిదోస్వాడ, మక్తగూడ, తాళ్లపల్లి, వెంకమ్మగూడ గ్రామాల్లో పర్యటించిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వం మీ భూములు తీసుకుంటుందని చెప్పడంతో ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే షాబాద్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేపట్టారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేగడిదోస్వాడ సర్వేనంబర్ 102లో ఉన్న సుమారు 400 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని గత 70 ఏళ్లుగా సుమారు 600 మంది రైతులు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. జీవనాధారమైన భూములను లాక్కుంటే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తంచేశారు. ఎట్టి పరిస్థితిలోనూ భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. తహసీల్దార్ అన్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం డెరెక్టర్ రాజారత్నం, ఆయా గ్రామాల మాజీ సర్పంచ్‌లు రాములు, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్, నారాయణరెడ్డి, నాలుగు గ్రామాల రైతులు తదితరులు ఉన్నారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధిత రైతుల నిరసన
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
డైబ్బె ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను ఇవ్వబోమని వెల్లడి


