ఎస్‌టీపీ నిర్మాణానికి శంకుస్థాపన
తుక్కుగూడ: మున్సిపల్ కేంద్రంలో మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్‌టీపీ) నిర్మాణ పనులకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎస్‌టీపీ ద్వారా గృహ, వాణిజ్య, పరిశ్రమల నుంచి వచ్చే మురుగునీరు శుద్ధి అవుతుందని అన్నారు. మురుగు నీటిలో హానికరమైన రసాయనాలు, దుర్వాసన, కాలుష్యాన్ని పూర్తిగా తొలగించడంలో ఎస్‌టీపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించి, పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాణి, హెచ్‌ఎండబ్ల్యూఎస్ సీజీఎం సుజాత, డీజీఎం భానుచందర్, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.


