కొడంగల్‌ రావాలె.. | - | Sakshi
Sakshi News home page

కొడంగల్‌ రావాలె..

Nov 25 2025 5:52 PM | Updated on Nov 25 2025 5:52 PM

కొడంగల్‌ రావాలె..

కొడంగల్‌ రావాలె..

గొప్ప చదువుకు

కొడంగల్‌: ‘గొప్ప చదువు చదవాలంటే కొడంగల్‌కు రావాలే.. రూ.5 వేల కోట్లతో విద్యా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నాం.. ఎడ్యూకేషన్‌, ఇరిగేషన్‌కు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బొంరాస్‌పేట మండలం ఎన్కేపల్లి సమీపంలో సోమవారం అక్షయ పాత్ర సెంట్రలైజ్‌డ్‌ కిచెన్‌ షెడ్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఇక్కడే రూ.103 కోట్ల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మహిళా సంఘాలకు కేటాయించిన బస్సును జెండా ఊపి ప్రారంభించారు. సంఘం సభ్యులకు చెక్కులు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. కొడంగల్‌ ప్రజల ఆశీర్వాదంతోనే తనకు ముఖ్యమంత్రి పదవి దక్కిందన్నారు. కొడంగల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. 70 ఏళ్లపాటు ఈ ప్రాంతం వెనుకబాటుకు గురైందని ఇప్పుడు అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందన్నారు. మళ్లీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చని పేర్కొన్నారు. కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. నియోజకవర్గానికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, మెడికల్‌, నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారామెడికల్‌ కళాశాలలు మంజూరు చేసినట్లు తెలిపారు. వీటి కోసం రూ.5 వేల కోట్లు వెచ్చించి ప్రత్యేక క్యాంపస్‌ నిర్మిస్తామని.. ఏడాదిన్నరలోపు పనులను పూర్తి చేస్తామన్నారు. కొడంగల్‌, నారాయణపేట, మక్తల్‌ నియోజకవర్గాల్లో లక్షా 5వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. కొడంగల్‌ – నారాయణపేట ఎత్తిపోతల పథకానికి రూ.5 వేల కోట్లు మంజూరు చేశామన్నారు. త్వరలో వికారాబాద్‌ – కృష్ణ రైల్వే లైన్‌ పనులు ప్రారంభించి మూడేండ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గురుకులాలకు అధునాతన వసతులతో కొత్త భవనాలు నిర్మిస్తామని చెప్పారు. క్రీడా ప్రాంగణం, ఇండోర్‌ స్టేడియం, స్పోర్ట్స్‌ కోచింగ్‌ సెంటర్‌, కొడంగల్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు వివరించారు. లగచర్లకు పారిశ్రామిక వాడ గుర్తింపు తెస్తామన్నారు. ప్రతి ఇంటికీ ఉచిత విద్యుత్‌, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్‌ దుకాణాల ద్వారా సన్న బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 312 పాఠశాలకు చెందిన 28 వేల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అండగా ఉంటూ అమ్మలా ఆకలి తీరుస్తుందన్నారు. కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ్మ, వాకిటి శ్రీహరి, హరే కృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, ఎస్పీ స్నేహమెహ్ర, కాంగ్రెస్‌ పార్టీ కొడంగల్‌ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎడ్యుకేషన్‌, ఇరిగేషన్‌కు మొదటి ప్రాధాన్యత

రూ.5 వేల కోట్లతో ప్రత్యేక క్యాంపస్‌

70 ఏళ్లుగా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు

మళ్లీ ఇలాంటి అవకాశం రాకపోవచ్చు

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి

ఎన్కేపల్లి సమీపంలో అక్షయ పాత్ర కిచెన్‌ షెడ్‌ నిర్మాణానికి భూమిపూజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement