విహార యాత్రలో విషాదం
వండర్‌లాలో ఈత కొడుతూ అస్వస్థతకు గురైన విద్యార్థి మృతి
ఇబ్రహీంపట్నం రూరల్: తో టి విద్యార్థులతో కలిసి విహార యాత్రకు వెళ్లిన విద్యార్థి మృతిచెందాడు. ఆదిబట్ల పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని బల్కంపేటకు చెందిన వేలంగి శివకుమార్ తేజ(13) అమీర్‌పేట్‌లోని నివేదిత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈనెల 21న విహార యాత్రలో భాగంగా తోటి విద్యార్థులతో కలిసి రావిర్యాల సమీపంలోని వండర్‌లాకు వచ్చాడు. మధ్యాహ్న భోజనం అనంతరం వండర్‌లాలోని కొలనులో ఈత కొడుతూ పడిపోయాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని, వెంటనే అంబులెన్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. బాలుడి తండ్రి సునీల్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.


