‘గ్లోబల్ సమ్మిట్’ పనులు వేగిరం!
సాక్షి, సిటీబ్యూరో: ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు ఆతిథ్యం ఇవ్వబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో మీర్‌ఖాన్‌పేట వేదికగా నిర్వహించతల పెట్టిన ఈ సమ్మిట్‌కు ఫార్చూన్–500 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కానుండడంతో..ప్రభుత్వం ఆ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. అమెజాన్ డేటా సెంటర్‌కు సమీపంలో సర్వే నంబర్ 120లోని వంద ఎకరాల విసీ్త్రర్ణంలో ఇప్పటికే బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేసింది. సమ్మిట్ సమయం సమీపిస్తుండటంతో అధికార యంత్రాంతం ఇప్పటికే భూమి చదను పనులు సహా ప్రధాన వేదికకు తూర్పు వైపున మూడు హెలిప్యాడ్‌ల పనులను ప్రారంభించింది. పది జేసీబీలతో విరామం లేకుండా పని చేయిస్తుంది. భద్ర తా పరమైన చర్యల కోసం సభాస్థలి చుట్టూ వందకుపైగా సీసీ కెమెరాలు, నిరంతరాయ విద్యుత్ సర ఫరా కోసం అదనపు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు సిద్ధం చేసింది. సదస్సు నిర్వహించే ప్రదేశానికి వెళ్లే సింగిల్ లేన్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించే పనులను కూడా ముమ్మరం చేసింది. ఒకటి రెండు రో జుల్లో ఈ రోడ్డు పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.
రోజుకో అధికారి సందర్శన
ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ‘తెలంగాణ విజన్ రైజింగ్–2047’ పేరుతో కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట వేదికగా నిర్వహించబోతున్న ఈ సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే 27 మంది ఉన్నతాధికారులతో తొమ్మిది కమిటీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఒక్కో విభాగానికి ఒక్కో సీనియర్ ఐఏఎస్‌ను ఇన్‌చార్జిగా నియమించింది. ఇప్పటికే వారంతా క్షేత్రస్థాయిలో పర్యటించి, విభాగాల వారీగా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. అధికారులు తాత్కాలిక డేరాల కింద కూర్చొని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఏడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన ఎఫ్‌సీడీఏ భవనం పుట్టింగ్ వర్క్ కొనసాగుతోంది. అదే విధంగా 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన స్కిల్ వర్సిటీ భవన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఒక అంతస్తు పూర్తైంది. రెండో ఫ్లోర్ నిర్మాణంలో ఉంది. సమ్మిట్ నాటికి ఒక ఫ్లోర్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిసింది. శనివారం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సహా సమ్మిట్ కో ఆర్డినేటర్, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఉన్నతాధికారుల వరుస సందర్శనలతో ఆ ప్రాంతంలో హడావుడి నెలకొంది.
మీర్‌ఖాన్‌పేటలో సందడే సందడి
అమెజాన్ సమీపంలో వంద ఎకరాల్లో లెవలింగ్ పనులు షురూ...
రోడ్ల విస్తరణ.. అదనపు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు సిద్ధం
తూర్పు వైపుమూడు హెలిపాడ్‌ల నిర్మాణం


