నవజాత శిశువుల సంరక్షణకు చర్యలు అవసరం
షాద్‌నగర్: నవజాత శిశువుల సంరక్షణకు తల్లులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి సూచించారు. జాతీయ నవజాత శిశువుల సంరక్షణ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో తల్లులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. శిశువు సంరక్షణలో తల్లుల పాత్ర కీలకమని అన్నారు. శిశువు పుట్టిన నాటి నుంచి కొన్ని నెలల పాటు తల్లి ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నవజాత శిశువులకు ఏదైనా బాధ, అనారోగ్యానికి సంబంధించిన సంకేతాలు తల్లులు నిశితంగా పరిశీలించాలని సూచించారు. శిశువులకు వైద్య సంరక్షణ ఎంత ముఖ్యమో పోషణ సంరక్షణ సైతం అంతే ముఖ్యమని అన్నారు. మంచి ఆహారం అందించడం, చర్మాన్ని తాకడం, తల్లిదండ్రులు తమ బిడ్డతో మంచి బంధాన్ని ఏర్పర్చుకోవాలని సూచించారు. అదేవిధంగా శిశువుల శరీరాన్ని ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచాలని, శరీరాన్ని తడి గుడ్డతో తుడవాలని సూచించారు. శిశువు పుట్టిన 48 గంటలలోపు మలవిసర్జన చేయకపోతే తగినంత పాలు అందడం లేదని అర్థం చేసుకోవాలన్నారు. ఆరు నెలల వరకు శిశువులకు విధిగా తల్లిపాలు ఇవ్వాలని, దీంతో రోగ నిఽరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శ్రీనివాస్‌రెడ్డి, విజయలక్ష్మి, నస్రీన్, ఆంజనేయులు, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి


