అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి
● దేవరంపల్లిలో ఘటన
● చేవెళ్ల పీఎస్‌లో కేసు నమోదు
చేవెళ్ల: అనుమానాస్పద స్థితిలో ఓ వృద్ధురాలు మృతిచెందిన ఘటన మండల పరిధిలోని దేవరంపల్లిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన అలుగారి సుమతమ్మ (66) ఇంటి వద్ద ఒంటరిగా ఉంటోంది. ఆమె కొడుకు రాఘవేందర్‌రెడ్డి పిల్లల చదువుకోసం, షాబాద్ మండలం నాగరగూడలో అద్దెకు ఉంటున్నాడు. నిత్యం దేవరంపల్లికి వచ్చి, తల్లితో కలిసి, వ్యవసాయ పనులు చేసుకుని, సాయంత్రం నాగరగూడకు వెళ్తాడు. రోజూ మాదిరిగానే శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటికి చేరుకోగా, అచేతనంగా పడిపోయిన తల్లిని గమనించి, చుట్టుపక్కల వారి సాయంతో చేవెళ్ల ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. సుమతమ్మ మెడలోని బంగారు గొలుసు, చెవి కమ్మలు కనిపించకపోవడంతో ఆమె మృతిపై అనుమానం వ్యక్తంచేస్తూ బాధిత కుటుంబ సభ్యులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, క్లూస్ టీమ్‌తో వెళ్లి ఆధారాలు సేకరించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు.


