ధరల మంట.. చప్పటి వంట
సాగుపై వర్షాల ప్రభావం తగ్గిన దిగుబడి.. పెరిగిన డిమాండ్ మార్కెట్లో ఏది కొనాలన్నా కిలో రూ.50పై మాటే.. మధ్యతరగతి జీవులకు ‘ధరా’ఘాతం
కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో అమాంతం పెరిగిపోయాయి. వ్యాపారులు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. ఏది కొనాలన్నా కిలో రూ.50 పైమాటే.. గతంలో కేజీ కొనేవారు ప్రస్తుతం పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు. ధరల మంట, చప్పటి వంటతో గృహిణులు వంటింటిని నెట్టుకొస్తున్నారు.
హుడా కాంప్లెక్స్: మార్కెట్లో మళ్లీ ట‘మోత’ మోగుతోంది. రైతు బజార్లలో కిలో రూ.50 పలుకుతుండగా,బహిరంగ మార్కెట్లో రూ.60పైగా అమ్ము తున్నారు. కార్తీక మాసం కావడం, వరుస వన భోజనాలు, అయ్యప్ప దీక్షలు, అన్నదానాలతో కూరగాయాలు, ఆకు కూరలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు ఇటీవల ఏకధాటి వర్షాలు, వరదలకు జిల్లాలో పంట దిగుబడి భారీగా తగ్గింది. డిమాండ్ మేరకు సరఫరా లేకపోవడంతో టమాట మాత్రమే కా దు.. బెండ, దొండ, గోకర, వంకాయ, బీన్స్, క్యారెట్, ఆలు అ న్నీ అమాంతం పెరిగిపోయా యి. నిన్న మొన్నటి వరకు కేజీ కొనుగోలు చేసిన సగటు కుటుంబం తాజా ధరలతో పావు కిలో, అరకేజీతో సరి సర్దుకుపోతోంది.
మెంతికట్ట రూ.30పైనే..
జిల్లాలోని చేవెళ్ల, యాచారం, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, శంషాబాద్, మొయినాబాద్, శంకర్‌పల్లి తదితర ప్రాంతాల్లో కాయగూరల సాగు ఎక్కువగా చేస్తుంటారు. మెజార్టీ రైతులు తమ పంటను సరూర్‌నగర్ రైతు బజార్, ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్, వనస్థలిపురం రైతుబజార్, బాలాపూర్ రైతు బజార్‌కు ప్రతి రోజూ ఉదయాన్ని తీసుకొచ్చి అమ్ముతుంటారు. సాధారణంగా ఈ సీజన్‌లో కూరగాయల ధరలు తక్కువగా ఉండాలి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. ఆశించిన స్థాయిలో దిగుబడి లేకపోవడంతో ధరలు పెంచి అమ్మాల్సి వస్తోందని రైతులే స్వయంగా చెబుతున్నారు. గోంగూర, పాలకూర, తోటకూరల ధరలు సైతం రెట్టింపయ్యాయి. ఇక మెంతి కట్టకు రూ.30పైగా చెల్లించాల్సి వస్తోంది. నిన్న మొన్నటి వరకు రూ.10కే దొరికిన పుదీనా, కొత్తిమీర కట్టలు ప్రస్తుతం రూ.25 పైగా పలుకుతున్నాయి.
కోడిగుడ్డ ధర రూ.7పైనే..
సాధారణంగా కార్తీక మాసంలో మాంసం, కోడిగుడ్ల వినియోగం తక్కువగా ఉంటుంది. చికెన్ ధరలు కూడా తక్కువగా ఉంటాయి. కానీ కోడిగుడ్ల ధరలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో ఒకటి రూ.7 చొప్పున పలుకుతుండగా, రిటేల్ మార్కెట్‌లో రూ.7.50 నుంచి రూ.8 వరకు విక్రయిస్తున్నారు. కోళ్ల ఫారాల సంఖ్య తక్కువగా ఉండటం, ఉన్నవి కూడా ఆఖరి దశలో ఉండటం గుడ్ల ధరలు పెరగడానికి కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో అంగన్‌వాడీలు, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలు, ఆస్పత్రుల్లో మధ్యాహ్న భోజనంలో భాగంగా అందించే గుడ్లలో సైతం కోత పెడుతున్నారు.
భగ్గుమంటున్న కూరగాయల రేట్లు
బహిరంగ మార్కెట్‌లో ధరలు
కిలో రూపాయల్లో..
బీన్స్ 120–150
చిక్కుడు 120
బెండకాయ 80–100
దొండ 60–80
పచ్చిమిర్చి 80
టమాటా 40– 60
బీరకాయ 60
వంకాయ 59–60
క్యాబేజీ 60
కాకర 60
దిగుబడి తగ్గడంతోనే..
గతంతో పోలిస్తే ప్రస్తుతం పంట దిగుబడి తగ్గింది. సరూర్‌నగర్ రైతు బజార్‌కు రోజుకు సగటున 540 నుంచి 560 క్వింటాళ్ల కూరగాయలు దిగుమతి కావాల్సి ఉంది. ప్రస్తుతం ఆశించిన స్థాయిలో పంట రావడం లేదు. డిమాండ్‌కు సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటమే ధరల పెరుగుదలకు కారణం.
– స్రవంతి, ఎస్టేట్ ఆఫీసర్, సరూర్‌నగర్
అరకిలోతో సరిపెట్టుకుంటున్నాం
మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఏది కొనలన్నా రూ.50 పైనే ఖర్చు చేయాల్సి వస్తోంది. విధిలేని పరిస్థితుల్లో అరకిలోతో సరిపెట్టుకుంటున్నాం. కూరగాయల ధరలతో పోలిస్తే పప్పు ధరలే నయం.
– శైలజ, గృహిణి
ధరల మంట.. చప్పటి వంట
ధరల మంట.. చప్పటి వంట


