ఫేక్ ఓసీలు.. ఫోర్జరీలు!
డిస్కంను బురిడీ కొట్టిస్తున్న కాంట్రాక్టర్లు తప్పుడు పత్రాలతోకనెక్షన్ల కోసం దరఖాస్తు అడిగినంత ముట్టజెబితే చాలు చూడకుండానే మంజూరు తాజాగా వెలుగులోకి సీఈఐజీ సంతకం ఫోర్జరీ ఘటన
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కొంతమంది ప్రైవేటు విద్యుత్ కాంట్రాక్టర్లు ఇటు వినియోగదారులను, అటు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) ను బురిడీ కొట్టిస్తున్నారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీల పేరుతో సృష్టించిన తప్పుడు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు(ఓసీ), ఫోర్జరీ సంతకాలతో కూడిన సీఈఐజీ అనుమతి పత్రాలు సమర్పిస్తూ మోసం చేస్తున్నా రు. క్షేత్రస్థాయి ఇంజనీర్లకు విషయం తెలిసీ పట్టించుకోవడంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. ఇప్పటికే పలు భవనాలకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి విద్యుత్ కనెక్షన్లు పొందినట్లు గుర్తించగా తాజాగా సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలో ఫోర్జరీ సంతకాలతో కూడిన సీఈఐజీ అప్రూవల్ సర్టిఫికెట్ సమర్పించిన కాంట్రాక్టర్ ఉదంతం బహిర్గతమైంది.
ప్రతి నెలా 35 వేల దరఖాస్తులు
గ్రేటర్‌లో ప్రస్తుతం 65 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ప్రతీ నెల 35 వేల మంది కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నారు. వీటిలో గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ భవనాలు, మల్టీ స్టోరేజీ బిల్డింగ్‌లు, పరిశ్రమలు ఉన్నాయి. ఆయా మల్టీస్టోరేజీ భవనాలకు తొలుత తాత్కాలిక కనెక్షన్లు జారీ చేస్తుంటారు. తర్వాత డిమాండ్‌ను బట్టి అంచనాలు రూపొందిస్తుంటారు. నిబంధనల ప్రకారం పది మీటర్ల ఎత్తు/ విద్యుత్ లోడు 25 కిలోవాట్లు మించి ఉన్న భవనాలకు కనెక్షన్ జారీ చేయాలంటే ముందు ఆ యా స్థానిక సంస్థల నుంచి ఆ క్యూపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) సమర్పించాల్సి ఉంది. తర్వాత డిస్కం నిర్దేశించిన ప్రమాణాల మేరకు అంతర్గత లైన్లు, కేబుల్, ఏబీ స్విచ్, హెచ్‌జీ ఫ్యూజ్‌సెట్స్, కండక్టర్ సహా డీటీఆర్, ఇతర మెటీరియల్ వాడినట్లు సీఈఐజీ ధ్రువీకరించిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) సమర్పించాలి.అన్నీ సవ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్న త ర్వాతే డిస్కం కనెక్షన్ రిలీజ్ చేస్తుంది.కానీ గచ్చిబౌలి టీఎన్‌జీఓ ఫేజ్–2కాలనీలో జీహెచ్‌ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేని నాలుగంతస్తుల భవనానికి మీటర్లు జారీ చేశారు. ఇదే కాలనీలో పది మీటర్ల కంటే ఎత్తు నిర్మించిన భవనానికి సైతం ప్యానల్ బోర్డులు, మీటర్లు జారీ చేశారు. కంచగచ్చిబౌలిలో రెండు భవనాలకు, నానక్‌రాంగూడలోని మరో భవనానికి ప్యానల్‌బోర్డులు, డీటీ ఆర్‌లు మంజూరు చేశారు. గౌలిదొడ్డిలో కనీస అనుమతులు లేని ఓ ఐదంతస్తుల భవనానికి మీటర్లు జారీ చేయడాన్ని పరిశీలిస్తే అక్రమార్కుల ఆగడాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
శివారు సెక్షన్లలో పాగా
మెజార్టీ భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మి స్తుండటం, శిఖం, బఫర్ జోన్లు, వివాదాస్పద, నిషే ధిత జాబితాలోని భూముల్లో నిర్మిస్తుండటంతో ఓసీల జారీకి మున్సిపాలిటీలు నిరాకరిస్తున్నాయి. ప్రమాణాల మేరకు విద్యుత్ పనులు చేయకపోవడంతో సీఈఐజీ కూడా ఎన్‌ఓసీ జారీ చేయడం లేదు. దీంతో ఫేక్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్నారు. ఏదీ ఒరిజినలో.. ఏదీ నకిలీనో గుర్తించే వ్యవస్థ డిస్కం వద్ద లేకపోవడం ఇటు కాంట్రాక్టర్లు, అటు క్షేత్ర స్థాయి ఇంజనీర్లకు కలిసి వస్తోంది. అమీన్‌పూర్, పటాన్‌చెరు, గచ్చిబౌలి, కంచ గచ్చిబౌలి, గౌలి దొడ్డి, కొండాపూర్, అయ్యప్పసొసైటీ, టీఎన్‌జీఓస్ కాలనీ, గోపన్‌పల్లి, అంజయ్యనగర్, శంషాబాద్, మోకిల, నార్సింగి, మొయినాబాద్, కోకాపేట్, వట్టి నాగులపల్లి, చిలుకూరు, సరూర్‌నగర్, మేడ్చల్, కీసర, బైరమల్‌గూడ, తుర్కయంజాల్, బడంగ్‌పేట్, తుక్కుగూడ, వనస్థలిపురం, బైరమల్‌గూడ, ఇబ్రహీంపట్నం సెక్షన్ల పరిధిలో ఫేక్ ఎన్‌ఓసీల దందా యథేచ్ఛగా జరుగుతున్నట్లు సమాచారం. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తి పడి క్షేత్రస్థాయి ఇంజనీర్లు పరోక్షంగా అక్రమార్కులకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నంబర్లు ఏమార్చి..
దరఖాస్తు సమయంలో వినియోగదారుని ఫోన్ నంబర్ బదులు, పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నంబర్లు ఇచ్చి దృష్టిని ఏమార్చుతున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని టీకేపల్లి, ఆమనగల్లు, మాడ్గులలో 417 కనెక్షన్లు ఒకే నంబర్‌తో దరఖాస్తు చేయడం గమనార్హం. ఎస్టిమేషన్ చార్జీ, ఎంపిక చేసిన విద్యుత్ లోడు, సూపర్ విజన్ చార్జీ, జీఎస్టీ, మెటీరియల్ కాస్ట్, లేబర్ చార్జీ ఇలా ఏ పనికి ఎంత ఖర్చవుతుంది వంటి కనీస సమాచారం భవన యజమానులకు చేరకుండా చేస్తున్నారు. రూ.2 లక్షల్లో పూర్తయ్యే పనులకు రూ.ఐదు లక్షల నుంచి రూ.పది లక్షల వరకు వసూలు చేస్తున్నారు. దీంట్లో లైన్ ఇన్‌స్పెక్టర్ మొదలు, ఏఈ, ఏడీఈ, డీఈ, ఎస్‌ఈ వరకు ఇలా ఎవరి వాటా వారికి చేరుతోంది. ఉన్నతాధికారులకు అనుమానం వచ్చి ఆరా తీస్తే అసలు మోసం వెలుగుచూసి అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలైంది.


