నచ్చినట్టు సర్దుబాటు!
పాఠశాలలు, ఉపాధ్యాయుల వివరాలు
మచ్చుకు కొన్ని డిప్యూటేషన్లు
విద్యార్థుల నిష్పత్తి ప్రకారమే..
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఉపాధ్యాయుల అంతర్గత సర్దుబాటు అంశం జిల్లా విద్యాశాఖలో వివాదాస్పదంగా మారుతోంది. పోస్టింగ్‌కు భిన్నంగా కొంత మంది ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్న తీరు ఆగ్రహానికి కారణమవుతోంది. విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించి, వారి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన జిల్లా విద్యాశాఖ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైరవీలతో అడ్డదారుల్లో వచ్చి ఏళ్ల తరబడి జిల్లాలో పాగా వేసిన అక్రమార్కులకు సైతం జిల్లా విద్యాశాఖ కొమ్ముకాస్తుండటం విశేషం. ఒక చోట పోస్టింగ్ పొంది.. మరో చోట విధులు నిర్వహిస్తుండటంతో పాఠ్యాంశాలు బోధించేందుకు టీచర్లు లేక ఆయా పాఠశాలల విద్యార్థులు తరచూ ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటికే కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రోడ్డెక్కగా, తాజాగా కడ్తాల్ మండలం ముద్విన్ పాఠశాల విద్యార్థులు పాఠశాల గేటుకు తాళం వేసి, అక్కడే బైఠాయించడం చర్చనీయాంశంగా మారింది.
రూరల్‌లో పోస్టింగ్.. అర్బన్‌లో విధులు
జిల్లాలో పనిచేస్తున్నవారిలో 50 శాతానికిపైగా ఉపాధ్యాయులు స్థానికేతరులే. అనారోగ్యకారణాలతో కొంత మంది, స్పౌజ్ కేటగిరిలో మరికొందరు, ఉపాధ్యాయ సంఘాల ముసుగులో ఇంకొందురు వచ్చి చేరారు. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల బంధువులు సైతం అడ్డదారుల్లో వచ్చి చేరారు. మొదట్లో వీరంతా కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ, కడ్తాల్, తలకొండపల్లి, మంచాల, మాడ్గుల సరిహద్దు మండలాల్లోని పాఠశాలల్లో పోస్టింగ్‌లు పొందుతున్నారు. ఆ తర్వాత తమకున్న రాజకీయ, ఆర్థిక బలాలతో అంతర్గత సర్దుబాటు పేరిట ఇంటికి సమీపంలో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల్లో వాలిపోతున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో విరామం లేకుండా పని చేయడం ఇష్టం లేని వారు పిల్లల సంఖ్య తక్కువ ఉన్న పాఠశాలను ఎంచుకుంటున్నారు. వర్క్ అడ్జెస్ట్‌మ్మెంట్ పేరుతో ఉపాధ్యాయులు వేరే చోట విధులు నిర్వహిస్తుడడంతో ఆయా పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. డిప్యూటేషన్లపై వెళ్లిన ఉపాధ్యాయులను వెనక్కి పంపాలని కోరినా డీఈఓ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాఠశాలలు 1,300
ఎస్‌జీటీలు4,054
స్కూల్ అసిస్టెంట్లు 3,997
హై స్కూల్ హెచ్‌ఎంలు 278
ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎంలు200
‘కడ్తాల్ మండలం ముద్విన్ ప్రభుత్వ పాఠశాలలో 141 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ ఇద్దరు(రమాదేవి, ప్రవీణ) సైన్స్ టీచర్లు ఉండగా, వీరిలో రమాదేవి ఇటీవల హెచ్‌ఎంగా పదోన్నతి పొంది నాగర్‌కర్నూల్ జిల్లాలో పోస్టింగ్ పొందారు. ప్రవీణ సైతం పైరవీతో తన ఇంటికి సమీపంలోని మన్సూరాబాద్ స్కూల్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లారు. దీంతో మూడు నెలలుగా 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు సైన్స్ బోధించే వారు లేరు. ఉన్నతాధికారులకు విన్నవించినా.. ఫలితం లేక విద్యార్థులంతా పాఠశాల గేటుకు తాళం వేసి, అక్కడే బైఠాయించారు. డీఈఓ సంబంధిత ఉపాధ్యాయురాలి డిప్యూటేషన్‌ను రద్దు చేసి, నిబంధనల మేరకు ఆమెను వెనక్కి పంపాల్సి ఉంది. కానీ ఇందుకు భిన్నంగా మాడ్గుల మండలం కలకొండ జెడ్పీహెచ్‌ఎస్‌లో పోస్టింగ్ పొంది, వర్క్ అడ్జెస్ట్‌మ్మెంట్‌లో భాగంగా హయత్‌నగర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న సైన్స్ టీచర్ పి.రాజును ముద్విన్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేయడంలో ఆంతర్యం అంతు చిక్కడం లేదు’.
పోస్టింగ్ ఒక చోట.. విధులు మరో చోట
విద్యాశాఖలో అడ్డగోలు డిప్యూటేషన్లు
సబ్జెక్టు టీచర్ల కోసం రోడ్డెక్కుతున్న విద్యార్థులు
ముద్విన్ పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన
కొందుర్గు మండలం ఉమ్మెత్యాలలో పోస్టింగ్ పొందిన నరేందర్‌రెడ్డి శంకర్‌పల్లిలో విధులు నిర్వహిస్తున్నారు.
న్యూఆగిరాలలో పోస్టింగ్ తీసుకున్న చంద్రశేఖర్‌రెడ్డి డీఈఓ ఆఫీసు(వయోజన విద్య)కు డిప్యూటేషన్‌పై వెళ్లారు.
లక్ష్మీదేవిపల్లి పాఠశాలలో పోస్టింగ్ పొందిన అతిరాం ఆరుట్ల పబ్లిక్ స్కూలుకు మారారు.
చెర్కుపల్లి పాఠశాలలో చేరిన సుష్మారెడ్డి గండిపేట్‌కు వెళ్లారు.
ముట్కూరు హైస్కూల్ నుంచి పీఈటీ శ్రావణి ఆరుట్ల పబ్లిక్ స్కూలుకు వెళ్లారు.
ఉత్తరాసుపల్లిలో పోస్టింగ్ పొందిన కరుణాకర్‌రెడ్డి సరూర్‌నగర్‌కు వెళ్లారు.
జిల్లేడుచౌదరిగూడ మండలం చింతకుంటతండాలో పోస్టింగ్ పొందిన రేణుక అబ్దుల్లాపూర్‌మెట్‌కు వెళ్లారు.
పెద్దఎల్కిచర్ల నుంచి వరప్రసాద్ శంకర్‌పల్లికి వెళ్లారు.
గ్రామీణ ప్రాంతాలు, తండాల పాఠశాలలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. విద్యార్థుల నిష్పత్తి మేరకు ఉపాధ్యాయులను నియమించాల్సి వస్తోంది. వర్క్ అడ్జెస్ట్‌మ్మెంట్‌లో భాగంగా ఖాళీగా ఉన్న కొంత మంది ఉపాధ్యాయులను అవసరం ఉన్న పాఠశాలకు అంతర్గత డిప్యూటేషన్లపై పంపాల్సి వస్తోంది. హయత్‌నగర్‌లో 1,200 మందికిపైగా విద్యార్థులకు 12 మంది టీచర్లే ఉన్నారు. మణికొండలో 1,400 మంది పిల్లలకు 18 మందే ఉన్నారు. ఇక్కడ విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులు లేక విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్న స్కూళ్ల నుంచి కొంత మంది టీచర్లను డిప్యూటేషన్లపై అడ్జెస్ట్ చేయాల్సి వస్తోంది.
– సుశీందర్‌రావు, డీఈఓ


