ఉద్యమకారుల ఆశయాలను నెరవేరుస్తాం
ఎల్మినేడులో చుక్కెదురు
● మలిదశ ఉద్యమానికి ఊపిరి సిరిపురం యాదయ్య
● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
మహేశ్వరం: సిరిపురం యాదయ్య ఆత్మాహుతితో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారని, ఆయన త్యాగం మరువలేమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం ఆమె మండల పరిధిలోని మహేశ్వరం గేటు వద్ద మలిదశ ఉద్యమకారుడు మహేశ్వరం వాసి సిరిపురం యాదయ్య విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. ఉద్యమకారుల ఆశయాలను తెలంగాణ జాగృతి నేరవేరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
జాబ్ క్యాలెండర్ జాడేది..?
బడంగ్‌పేట్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వడం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం ఆమె బడంగ్‌పేటలోని జిల్లా గ్రంథాలయ కేంద్రాన్ని సందర్శించారు. నిరుద్యోగులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను విస్మరించిందని.. ప్రస్తుత ప్రభుత్వమైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లైబ్రరీలో వసతులు కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో శ్రీనివాస్ తదితరులున్నారు.
జాగృతి కార్యాలయం ప్రారంభోత్సవం
కందుకూరు: మండల పరిధిలోని కొత్తూర్‌గేట్ శ్రీశైలం హైవేపై జాగృతి నియోజకవర్గం ఇన్‌చార్జి అందుగుల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాగృతి కార్యాలయాన్ని శుక్రవారం కవిత ప్రారంభించారు. అంతకుముందు కొత్తూర్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకే
‘జాగృతి జనం బాట’
మీర్‌పేట: ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకే ముందుకొచ్చానని కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మీర్‌పేట కూడలిలో జరిగిన సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. 19 ఏళ్లుగా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడేందుకు జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడంతో పాటు తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించిందని గుర్తుచేశారు. రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు అవుతున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ప్రశ్నించే వారుంటేనే పనులవుతాయని, ప్రభుత్వం నిరంతరం అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. చెరువుల కబ్జా అవుతున్నా హైడ్రా ఏం చేస్తోందన్నారు. జిల్లాలో ఆస్పత్రుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో జాగృతి కమిటీలను వేసి బలోపేతం చేస్తామని, జనంబాటలో ప్రజలంతా భాగస్వాములై సమస్యలపై పోరాడుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు సి.లావణ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్: ఎల్మినేడులో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మండల పరిధిలోనలి ఎల్మినేడు గ్రామంలో శుక్రవారం కల్వకుంట్ల కవిత పర్యటించారు. భూ నిర్వాసితులతో మాట్లాడేందుకు వచ్చిన ఆమె సమస్యలు చెప్పాలని కోరగా ఎవరూ ముందుకు రాలేదు. హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ ఆడి వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్‌కిరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


