ప్రజా పోరాటమే ఎజెండా
● జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
● జిల్లాలో విస్తృత పర్యటన
షాద్‌నగర్: ప్రజా సమస్యలపై పోరాడటమే ఎజెండాగా ముందుకు సాగుతామని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత రిజర్వేషన్లు తగ్గు తూ వస్తున్నాయని ఆరోపించారు. ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె జిల్లాలో పర్యటించారు. షాద్‌నగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులను కలిసి వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పట్టణంలోని కమ్యూనిటీ ఆస్పత్రి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, పట్టణ శివారులో నిర్మిస్తున్న వంద పడకల ఆస్పత్రిని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల వసతుల కల్పనకు నిధుల కొరత ఉందని, ఈవిషయంపై సీఎం రేవంత్‌రెడ్డి శ్రద్ధ చూపాలని సూచించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రీజనల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన బాధితులను పరామర్శించారు. ట్రిపుల్ ఆర్ కోసం పెద్దోళ్ల భూములను వదిలేసి, పేదల భూములను తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ప్రాణాలైనా ఇస్తాం.. కానీ భూములను వదులుకోమని కన్నీటి పర్యంతమయ్యారు. కోల శ్రీనివాస్, కప్పాటి పాండురంగారెడ్డి, రమేశ్, లింగంముదిరాజ్ పాల్గొన్నారు.
రిలేదీక్షలకు మద్దతు
షాబాద్: నలభై రోజులుగా కొనసాగుతున్న బీసీ రిజర్వేషన్ల సాధన రిలే దీక్షలకు కవిత మద్దతు తెలిపారు. జ్యోతిరావుపూలే, అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాలలు నివాళులర్పించారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు రైల్ రోకో వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారయ్య, ముస్తఫా, రాజేందర్‌గౌడ్ తమ్మలి రవీందర్, రాపోల్ నర్సింహులు, వెంకట్‌యాదవ్, రమేష్‌యాదవ్, రాము పాల్గొన్నారు.
పట్టువస్త్రాల సమర్పణ
శంకర్‌పల్లి: మోకిలలో కొనసాగుతున్న ఎల్లమ్మ, పోచమ్మ ఆలయాల వార్షికోత్సవంలో కవిత పాల్గొన్నారు. అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.లంబాడా మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు.
దర్గాలో ప్రార్థనలు
నందిగామ: కొత్తూరు మండల పరిధిలోని జహంగీర్ పీర్ దర్గాను కవిత దర్శించుకున్నారు. చాదర్, దట్టీలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఆలయాన్ని అభివృద్ధి చేయాలి
మహేశ్వరం: మండల కేంద్రంలోని శివ గంగ రాజరాజేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం ఆలయాభివృద్ధి చేయాలని కోరారు.


