అట్రాసిటీ కేసులు వేగంగా పరిష్కరించాలి
● ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
● కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖలతో సమీక్ష సమావేశం
యావజ్జీవ శిక్ష పడేలా చర్యలు
షాద్‌నగర్: రాజశేఖర్‌ను హత్య కేసులో నిందితులకు యావజ్జీవ శిక్ష పడేలా చర్యలు తీసుకుంటా మని ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. గురువారం ఆయన ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని ఎల్లంపల్లిలో ఇటీవల హత్యకు గురైన రాజశేఖర్ కుటుంబాన్ని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, శంషాబాద్ అడిషనల్ డీసీపీ పూర్ణచందర్, ఆర్‌డీఓ సరిత, ఏసీపీ లక్ష్మీనారాయణతో కలిపి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున రూ.4.12 లక్షల చెక్కు అందజేశారు. అనంతరం వెంకటయ్య మాట్లాడుతూ.. ఆధునిక యుగంలోనూ పరువు హత్యలు బాధాకరమన్నారు.రాజశేఖర్ కుటుంబానికి కమిషన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో రూ.50 లక్షల విలువ చేసే డబుల్ బెడ్‌రూం, ఐదు ఎకరాల భూమి అందజేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాజశేఖర్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలవాలని కలెక్టర్, పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు. అవసరానుసారం ఎల్లంపల్లిలో పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆలయ ప్రవేశ కార్యక్రమం చేపట్టండి
గ్రామంలో ఉన్న ఆలయంలోకి దళితులకు ప్రవేశం లేదని తెలుసుకున్న వెంకటయ్య వెంటనే ఆలయ ప్రవేశ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. అన్నివర్గాలతో సమావేశం ఏర్పాటు చేసి చట్టాలపై అవగాహన కల్పించి, సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్, రాంబాబు నాయక్, తహసీల్దార్ నాగయ్య, సీఐ విజయ్‌కుమార్, నాయకులు సిద్దార్థ, రవి, జగన్, అనిల్‌కుమార్, భవానీమల్లేశ్, వేణుగోపాల్, రవి పాల్గొన్నారు.


