శివోహం.. ఘనంగా సమాప్తం
ముగిసిన ఆరుట్ల బుగ్గ జాతర
● ఆలయానికి రూ.14.95 లక్షల ఆదాయం
మంచాల: దక్షిణ కాశీగా పేరొందిన ఆరుట్ల శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి జాతర గురువారంతో ముగిసింది. ఈనెల 5న కార్తీక పౌర్ణమి రోజున ప్రారంభమైన ఉత్సవాలు 20వ తేదీ నాటికి పదిహేను రోజులు పూర్తి చేసుకొని వైభవంగా ముగింపు పలికింది. పక్షం రోజులపాటు నిర్విరామంగా కొనసాగిన ఉత్సవాలకు పది లక్షల మంది భక్తులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రకాలుగా ఆలయానికి రూ.14.95 లక్షల ఆదాయం వచ్చింది. వాటిలో దాదాపు రూ.9 లక్షలు చందాల రూపంలో రాగా, రూ.1.50 లక్షలు లడ్డూ ప్రసాదం, రూ.2.05 లక్షలు పార్కింగ్, తైబజారు రూ.2.40 లక్షలు సమకూరాయి. నిత్యం పటిష్ట బందోబస్తుతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ యాదయ్య, కమిటీ సభ్యులు నిత్యం జాతరలో ఉండి భక్తులకు ఇబ్బందులు లేకుండా సహకరించారు. జాతరకు వచ్చిన పది లక్షల మందిలో 60 శాతం మహిళలే ఉన్నారు. మహిళలు స్నానాలు చేసి కార్తీక దీపారాధన చేసి తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు.
ఉత్సవాల్లో బొమ్మలు కొనుగోలు చేస్తున్న మహిళలు
స్వామి దర్శనం కోసం భారీగా వచ్చిన భక్తులు
శివోహం.. ఘనంగా సమాప్తం


