ఆలయాలకు సోలార్ సెక్యూరిటీ
● సీఎస్‌ఆర్‌లో భాగంగా 60 సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎస్‌బీఐ, యూబీఐ
● సీఎస్‌ఆర్ ఆధారిత సామాజిక భద్రత దేశానికే ఆదర్శం: రాజేంద్రనగర్ అదనపు డీసీపీ శ్రీనివాసరావు
మొయినాబాద్: ఆలయ భద్రతకు సోలార్ ఆధారిత సీసీ కెమెరాల ఏర్పాటుకు చిలుకూరు బాలాజీ ఆలయం వేదికయింది. సీఎస్‌ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ)లో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) బ్యాంకులు 60 సోలార్ సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నాయి. అందుకు అవసరమైన నిధులను గురువారం చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద ఆయా బ్యాంకుల ప్రతినిధులు సరఫరాదారుడికి చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సామాజిక భద్రత, సుస్థిర అభివృద్ధి రంగాల్లో సీసీఆర్ ద్వారా దేశవ్యాప్తంగా బ్యాంకులు–ఆలయాల భాగస్వామ్యానికి కొత్త దారి చూపుతూ చిలుకూరులో సోలార్ సీసీ కెమెరాల ఏర్పాటుకు బ్యాంకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. గ్రామీణ ఆలయాల భద్రతను బలోపేతం చేయడంతోపాటు పర్యావరణ అనుకూల పర్యవేక్షణ వ్యవస్థలను ప్రవేశపెట్టడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమన్నారు. ఆలయ భద్రతలో రిమోట్ సర్వేలెన్స్ సొల్యూషన్లను సీఆర్‌ఆర్‌కు అనుసంధానం చేయడం దేశంలో ఇదే తొలుత అన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ మాట్లాడుతూ.. ఆలయ సముదాయాలకు సీఎస్‌ఆర్ ఆధారిత సామాజిక భద్రత దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ ప్రాజెక్టును చిలుకూరులో ప్రారంభించినందుకు ఎస్‌బీఐ, యూబీఐ అధికారులు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ, ఎస్‌బీఐ డీజీఎం సలీల్ శుక్ల, రీజనల్ మేనేజర్ నితిన్‌కుమార్, మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.


