కులాంతర వివాహితులకు రక్షణ చట్టం తేవాలి
షాద్‌నగర్‌రూరల్: రాష్ట్రంలో జరుగుతున్న కుల దురహంకార హత్యలను నివారించేందుకు ప్రభుత్వం కులాంతర వివాహితులకు ప్రత్యేక రక్షణ చటం తేవాలని ఆలిండియా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి వెంకట్రాములు డిమాండ్ చేశారు. సంఘం నాయకులు బుధవారం మండల పరిధిలోని ఎల్లంపల్లి గ్రామాన్ని సందర్శించారు. మృతుడి రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో మాదిగ ఐక్యవేదిక, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, వివిధ పార్టీల నాయకుల సంయుక్త ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రాములు మాట్లాడుతూ.. కొందరు కుల ఉన్మాదులుగా వ్యవహరించి దళిత యువకుడిని అత్యంత అమానవీయంగా హత్య చేయడం వెనుక ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. రోజురోజుకూ కుల దురహంకార హత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందించకపోవడం బాధాకరమన్నారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వడంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్ హత్యను నిరసిస్తూ ఈ నెల 20, 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు అంజయ్య, జగన్, శ్రీనునాయక్, రాజు, సాయిబాబు, పెంటనోళ్ల నర్సింలు, దొడ్డి శ్రీనివాస్, శ్రీకాంత్, ఈశ్వర్‌నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


